NTV Telugu Site icon

SA vs AFG: తొలిసారిగా ఫైనల్‌కు చేరడం సంతోషం.. ఫైనల్‌ కోసం భయపడటం లేదు: మార్‌క్రమ్‌

Aiden Markram

Aiden Markram

Aiden Markram on South Africa Reach ICC T20 World Cup Final: టీ20 ప్రపంచకప్‌లో తొలిసారిగా ఫైనల్‌కు చేరడం చాలా ఆనందంగా ఉందని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఐడెన్ మార్‌క్రమ్‌ తెలిపాడు. జట్టు సమిష్టి కృషి వల్లే ఫైనల్‌ వరకు వచ్చామన్నాడు. ఫైనల్‌ మ్యాచ్‌ కోసం తాము భయపడటం లేదని, ఇదే ప్రదర్శనను ఫైనల్‌ మ్యాచ్‌లో చేస్తామని మార్‌క్రమ్‌ ధీమా వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరింది. టీ20 ప్రపంచకప్‌ 2024లో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది.

మ్యాచ్‌ అనంతరం ఆదక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఐడెన్ మార్‌క్రమ్‌ మాట్లాడుతూ… ‘తొలిసారిగా ఫైనల్‌కు చేరడం చాలా ఆనందంగా ఉంది. ఈ గెలుపు కేవలం నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. ఇదంతా జట్టు విజయమే. జట్టు విజయం వెనకాల చాలా మంది పాత్ర ఉంది. అదృష్టవశాత్తూ టాస్‌ ఓడిపోయాం. మేం కూడా ముందుగా బ్యాటింగ్‌ చేద్దామనుకున్నాం. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. సరైన సమయాల్లో కీలక వికెట్లు తీశారు. పిచ్‌ చాలా కఠినంగా ఉంది. ఒక్కడ బ్యాటింగ్‌ చేయడం సవాల్‌గా మారింది. మాకు కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. వెంటవెంటనే వికెట్లు తీయడంతో సులువుగా విజయం సాధించాం’ అని చెప్పాడు.

Also Read: Kalki 2898 AD Tickets: ‘కల్కి 2898 ఏడీ’ హిట్ టాక్.. జోరుగా బ్లాక్ టిక్కెట్ల దందా!

‘టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలంటే ఇంకో మెట్టు ఎక్కాల్సి ఉంది. ఈ అవకాశం ఇప్పటివరకు మాకు రాలేదు. వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాం. ఫైనల్‌ మ్యాచ్‌ కోసం మేం భయపడటం లేదు. ఈ విజయమే మాకు గొప్ప. జట్టులో ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉన్నారు. అయితే విజయం సాధించాలంటే అందరి సమష్టి కృషి అవసరం. ఫైనల్‌ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేస్తాం’ అని మార్‌క్రమ్‌ తెలిపాడు. వన్డే ప్రపంచకప్‌, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. 1992 నుంచి 2024 వరకు ఈ రెండు ఫార్మట్‌లలో 8 సార్లు సెమీస్‌కు చేరింది.