NTV Telugu Site icon

Gary Kirsten Pakistan: పాకిస్తాన్ అసలు జట్టే కాదు.. బాబర్ సేనపై చీఫ్ కోచ్‌ కిర్‌స్టన్‌ తీవ్ర విమర్శలు!

Gary Kirsten Pakistan

Gary Kirsten Pakistan

Gary Kirsten Comments on Pakistan Team: టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన పాకిస్థాన్‌పై ఆ జట్టు చీఫ్‌ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. పాకిస్తాన్ అసలు జట్టే కాదని, ఆ టీంలో ఐక్యత లేనే లేదన్నాడు. పాక్ జట్టులోని కీలక ఆటగాళ్ల మధ్య మాటలు లేవని, కొంతమంది ఆటగాళ్లు తీవ్రమైన ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపాడు. ఫిట్‌నెస్ సమస్యలే టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ వైఫల్యానికి ప్రధాన కారణం అని గ్యారీ కిర్‌స్టన్ చెప్పినట్లు పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్ పేర్కొంది.

‘పాకిస్తాన్ జట్టులో అసలు ఐక్యత లేదు. పాక్ జట్టు అని పిలుస్తారు కానీ అది జట్టే కాదు. ప్లేయర్స్ ఒకరికొకరు మద్దతుగా నిలవరు. జట్టులో అందరూ విడిపోయారు. గతంలో చాలా జట్లతో పనిచేశా. కానీ ఇలాంటి పరిస్థితిని నేను ఎప్పుడూ చూడలేదు. భారత్‌ చేతిలో ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆ మైదానంలో 120 పరుగుల లక్ష్యం అంత ఈజీ కాదని తెలుసు. టీమిండియా 120 పరుగుల వద్దే ఆగిపోయిందంటే.. లక్ష్య ఛేదన కష్టమే. అయితే పాక్ 72/2తో ఉన్నప్పుడు మ్యాచ్‌ మా చేతుల్లోనే ఉంది. అలాంటి స్థితి నుంచి మ్యాచ్‌ను కోల్పోవడం చాలా నిరాశ కలిగించింది’ అని గ్యారీ కిర్‌స్టన్‌ పేర్కొన్నాడు.

Also Read: Lockie Ferguson Record: ఫెర్గూసన్‌ సంచలన ప్రదర్శన.. 4 ఓవర్లు, 4 మెయిడెన్లు, 3 వికెట్లు!

టీ20 ప్రపంచకప్‌ 2024కు కావాల్సిన సామర్థ్యం పాకిస్తాన్ జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు లేదని, షాట్ సెలెక్షన్‌లో కొందరికి కనీస క్లారిటీ లేదని గ్యారీ కిర్‌స్టన్ విమర్శించినట్లు జియో న్యూస్ తమ కథనంలో పేర్కొంది. మెరుగైన ప్రదర్శన చేసే వారికే జట్టులో చోటు ఇవ్వాలని, జట్టు విజయం కోసం ఆడే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని పీసీబీ అధికారులతో కిర్‌స్టన్ అన్నట్లు తెలుస్తోంది. పేలవ ప్రదర్శన, గ్రూప్ రాజకీయాలు చేసే వారికి జట్టులో చోటు ఇవ్వొద్దని సెలెక్టర్లకు సూచించినట్లు సమాచారం. ఇక టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా, భారత్ చేతిలో ఓడిన పాక్.. కెనడా, ఐర్లాండ్‌పై గెలిచినా సూపర్ 8కు అర్హత సాధించలేకపోయింది.