NTV Telugu Site icon

IND vs USA: హార్దిక్‌ పాండ్యా విఫలమైతే.. జట్టు కూర్పుపై చాలా ప్రభావం పడేది: టీమిండియా కోచ్

Hardik Pandya

Hardik Pandya

Paras Mhambrey on Hardik Pandya: హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ సత్తాపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఎప్పుడూ నమ్మకంగానే ఉన్నామని టీమిండియా బౌలింగ్‌ కోచ్ పరాస్‌ మాంబ్రే తెలిపారు. ఏ ప్లేయర్ అయినా కొన్నిసార్లు లయను అందుకోవడానికి కాస్త సమయం పడుతుందన్నాడు. బౌలింగ్‌లో సత్తా చాటుతున్న హార్దిక్‌.. తప్పకుండా బ్యాటింగ్‌లో రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. హార్దిక్‌ బౌలింగ్‌లో మంచి ప్రదర్శన చేయకపోతే.. జట్టు కూర్పుపై చాలా ప్రభావం పడేదని మాంబ్రే పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా నేడు అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో నేటి రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ సూపర్‌ 8కి దూసుకెళుతుంది.

అమెరికా మ్యాచ్‌కు ముందు టీమిండియా బౌలింగ్‌ కోచ్ పరాస్‌ మాంబ్రే మాట్లాడుతూ… ‘హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ సత్తాపై మేం ఎప్పుడూ నమ్మకంగానే ఉన్నాం. కొన్నిసార్లు లయ అందుకోవడానికి సమయం పడుతుంది. ఎక్కువగా సాధన చేస్తేనే.. నాణ్యమైన ప్రదర్శన చేసేందుకు అవకాశం ఉంటుంది. హార్దిక్‌ ఆ విషయంలో వెనుకడుగు వేయడు. నిలకడగా బంతులేయడంపై దృష్టి సారించాడు. అందుకోసం తీవ్రంగా ప్రాక్టీస్‌ చేశాడు. ఆ ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్నాం. బౌలింగ్‌లో సత్తా చాటుతున్న హార్దిక్‌.. వచ్చే మ్యాచుల్లో బ్యాటింగ్‌లోనూ జట్టుకు అండగా నిలుస్తాడు. ఒకవేళ హార్దిక్‌ బౌలింగ్‌లో రాణించకపోయియుంటే.. టీమిండియాకు ఇబ్బందిగా మారేది. జట్టు కూర్పుపై చాలా ప్రభావం పడేది’ అని తెలిపాడు.

Also Read: IND vs USA: భయం మా బ్లెడ్‌లోనే లేదు.. టీమిండియాకు గట్టి పోటీనిస్తాం: అమెరికా ప్లేయర్

‘టీ20 ప్రపంచకప్‌ 2024 ముందు కూడా హార్దిక్‌ పాండ్యా నిబద్ధతలో ఏ మార్పు లేదు. పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా బౌలింగ్‌ చేయాలో అతడికి తెలుసు. గత రెండు మ్యాచుల్లో హార్దిక్ బౌలింగ్‌ను చూశాం. ఐపీఎల్‌ 2024తో పోలిస్తే చాలా బాగా బంతులు వేస్తున్నాడు. మెగా టోర్నీలో హార్దిక్ మరింత రాణిస్తాడు’ అని పరాస్‌ మాంబ్రే ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ 2024లో 14 మ్యాచుల్లో 11 వికెట్స్ మాత్రమే తీసి.. పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. దీంతో అతడిని ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. అయితే ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో 5 వికెట్లు తీశాడు.