NTV Telugu Site icon

Arshdeep Singh: ఎక్కువ పరుగులు ఇచ్చా.. నామీద నమ్మకం ఉంచిన రోహిత్‌కు ధన్యవాదాలు: అర్ష్‌దీప్‌

Arshdeep Singh Bowling

Arshdeep Singh Bowling

Arshdeep Singh Thanks Rohit Sharma For Belief: టీ20 ప్రపంచకప్‌ 2024లో ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో ఎక్కువ పరుగులు ఇచ్చానని, యూఎస్‌ఏపై తన ప్రదర్శనతో అసంతృప్తిగా ఉన్నానని భారత యువ బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ తెలిపాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ఎక్కువ రన్స్ ఇచ్చినా.. తనపై నమ్మకం ఉంచిన టీమిండియా మేనేజ్‌మెంట్, కెప్టెన్‌ రోహిత్ శర్మకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు. పరుగులు చేయడానికి ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా బంతులేశాం అని చెప్పాడు. సూపర్ 8లోనూ ఇదే బౌలింగ్‌తో గెలిచేందుకు ప్రయత్నిస్తాం అని అర్ష్‌దీప్‌ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్‌-ఏలో భాగంగా బుధవారం యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ (4-0-9-4) అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు.

యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 9 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. అద్భుత బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన అర్ష్‌దీప్‌కే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అర్ష్‌దీప్‌ మాట్లాడుతూ… ‘గత రెండు మ్యాచ్‌ల్లో నేను ఎక్కువ పరుగులు ఇచ్చా. ఇప్పుడు నా ప్రదర్శనతో అసంతృప్తిగా ఉన్నా. జట్టు ఎప్పుడూ నాపై నమ్మకాన్ని ఉంచింది. నాకు అండగా నిలిచింది. నా మీద నమ్మకం ఉంచిన టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్‌కు ధన్యవాదాలు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే.. నేను మంచి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌ల్లో రాణించినందుకు సంతోషంగా ఉంది’ అని తెలిపాడు.

Also Read: Arshdeep Singh Record: ప్రపంచకప్‌లో తొలి బౌలర్‌గా అర్ష్‌దీప్‌ సింగ్ అరుదైన రికార్డు!

‘పిచ్‌ పేసర్లకు అనుకూలంగా ఉంది. వికెట్లే లక్ష్యంగా బంతులు వేయాలని మేం అనుకున్నాం. అందుకు తగ్గట్టుగానే బౌలింగ్‌ చేశా. ప్రత్యర్థి బ్యాటర్లు పరుగులు చేయకుండా బంతులేశాం. ఇలాంటి పిచ్‌పై ఎక్కువ పరుగులు ఇస్తే.. లక్ష్య ఛేదన మరింత క్లిష్టంగా మారుతుంది. మా బ్యాటర్లు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అంతర్జాతీయ మ్యాచ్ ఆడేటప్పుడు పిచ్‌ పరిస్థితులను త్వరగా అర్థం చేసుకోవాలి. బౌలర్లు అందరూ రాణించడంతో యూఎస్‌ఏని తక్కువ స్కోరుకే కట్టడి చేశాం. ఇదే బౌలింగ్‌తో సూపర్ 8లోనూ గెలిచేందుకు ప్రయత్నిస్తాం’ అని అర్ష్‌దీప్‌ సింగ్‌ చెప్పాడు.