NTV Telugu Site icon

Arshdeep Singh Record: ప్రపంచకప్‌లో తొలి బౌలర్‌గా అర్ష్‌దీప్‌ సింగ్ అరుదైన రికార్డు!

Arshdeep Singh

Arshdeep Singh

Arshdeep Singh Breaks R Ashwin T20 World Cup Record: భారత యువ బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌లో 10 పరుగులు కంటే తక్కువ ఇచ్చి.. నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా యూఎస్‌ఏపై (4-0-9-4) అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో ఈ రికార్డు అర్ష్‌దీప్‌ ఖాతాలో చేరింది. ఈ క్రమంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ (4/11) రికార్డును అర్ష్‌దీప్ బద్దలు కొట్టాడు. 2024 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై యాష్ ఈ గణాంకాలు నమోదు చేశాడు.

టీ20 ప్రపంచకప్‌లో నాలుగు వికెట్లు తీసి.. తక్కువ రన్స్ ఇచ్చిన జాబితాలో అర్ష్‌దీప్‌ సింగ్‌, రవిచంద్రన్ అశ్విన్‌ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరిద్దరి తర్వాత హర్భజన్ సింగ్ ఉన్నాడు. 2012 టీ20 ప్రపంచకప్‌లో హర్భజన్ 12 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆర్పీ సింగ్ దక్షిణాఫ్రికాపై 13 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ పడగొట్టాడు. ఇక 2009 ప్రపంచకప్‌లో జహీర్ ఖాన్ ఐర్లాండ్ జట్టుపై 19 పరుగులు ఇచ్చి.. 4 వికెట్స్ తీశాడు. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక మాజీ స్పిన్నర్ అజంతా మెండిస్ (8/6) బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. ప్రపంచకప్‌లో మరే బౌలర్ 6 వికెట్స్ తీయలేదు.

Also Read: IND vs USA: అదే మా కొంపముంచింది: ఆరోన్ జోన్స్

అర్ష్‌దీప్‌ సింగ్‌ మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో తొలి బంతికే వికెట్‌ తీసిన మొదటి భారత బౌలర్‌గానూ అరుదైన ఘనత సాధించాడు. యూఎస్‌ఏ బ్యాటర్ షయాన్‌ జహంగీర్ (0)ను తొలి బంతికే ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. అర్ష్‌దీప్‌ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన. యూఎస్‌ఏ బ్యాటర్లను అర్ష్‌దీప్‌ ఓ ఆటాడుకున్నాడు. మొదటి ఓవర్లోనే రెండు వికెట్స్ తీసి దెబ్బకొట్టాడు. ఆపై మరో రెండు వికెట్స్ తీసి సత్తాచాటాడు.