NTV Telugu Site icon

IND vs ENG: ఒకప్పటి టీమిండియా కాదు.. అరవీర భయంకరంగా ఉంది: ఇంగ్లండ్ కెప్టెన్

Jos Buttler

Jos Buttler

Jos Buttler Said Team India has completely changed Now: టీ20 ప్రపంచకప్‌ 2024 తుది దశకు చేరుకుంది. ఇప్పుటికే సెమీస్‌-2 పూర్తవగా.. మరికొద్ది గంటల్లో సెమీస్‌-2 జరగనుంది. ఇంగ్లండ్‌తో తలపడేందుకు భారత్‌ సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీస్‌లో ఇంగ్లండ్‌తోనే ఆడిన భారత్‌.. 10 వికెట్ల తేడాతో చిత్తయింది. దీంతో టీమిండియాపై ఈసారి తీవ్ర ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అయితే 2022 సెమీస్‌లో తాము ఓడించిన భారత జట్టు ఇది కాదని, ప్రస్తుత టీమిండియా అరవీర భయంకరంగా ఉందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. భారత జట్టు ఇప్పుడు దూకుడు మంత్రంతో ఆడుతోందని తెలిపాడు.

సెమీస్‌-2 మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న జోస్ బట్లర్ పలు విషయాలపై స్పందించాడు. ‘2022 సెమీస్‌లో ఆడిన భారత జట్టుకు, ఇప్పటి జట్టుకు చాలా తేడా ఉంది. ఇప్పుడు మేం భిన్నమైన టీమిండియాతో ఆడనున్నాం. రోహిత్ శర్మ జట్టును నడిపించిన తీరు అద్భుతం. బ్యాటర్ల ఆడే విధానాన్ని చూస్తుంటే.. స్వేచ్ఛగా ఆడుతూ దూకుడైన ప్రదర్శన చేస్తున్నారు. 2022 టోర్నీ తర్వాత భారత జట్టు పూర్తిగా మారిపోయిందనిపిస్తుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడింది. దూకుడు మాత్రంగా భారత్ ఆడుతోంది. టీమిండియాకు బదులివ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. భారత్ మాదిరే దూకుడుగా మేమూ ఆడతాం’ అని బట్లర్ చెప్పాడు.

Also Read: IND vs ENG: ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌.. అతడితో జర జాగ్రత్త విరాట్!

టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్ అపజయం లేకుండా కొనసాగుతోంది. గ్రూప్, సూపర్-8 స్టేజ్‌లో వరుస విజయాలు సాధించింది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లను ఇంటికి పంపిన రోహిత్ సేన.. 2022 సెమీస్‌ ప్రతీకారానికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతిలో ఇంగ్లండ్ ఓడింది. భారత్‌, ఇంగ్లండ్ తలపడిన గత ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట భారత్‌ విజయం సాధించింది.