NTV Telugu Site icon

IND vs AUS: నేడు భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్.. గెలిస్తేనే కంగారులను సెమీస్‌ ఆశలు!

Ind Vs Aus

Ind Vs Aus

India vs Australia Playing 11: టీ20 ప్రపంచకప్‌ 2024లో ఆసక్తికర పోరుకు వేళైంది. సూపర్‌-8 మ్యాచ్‌ గ్రూప్‌-1లో భాగంగా సోమవారం భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి గ్రూప్‌ టాపర్‌గా నిలవడమే కాకుండా.. సెమీఫైనల్లో అడుగుపెట్టాలని టీమిండియా చూస్తోంది. భారత్‌కు సెమీస్‌ స్థానం దాదాపుగా ఖాయమైనప్పటికీ.. ఆసీస్ మ్యాచ్‌లోనూ నెగ్గితే నేరుగా ముందంజ వేస్తుంది. మరోవైపు అఫ్గానిస్థాన్‌ చేతిలో అనూహ్య ఓటమి కారణంగా.. సెమీస్‌ చేరాలంటే టీమిండియా మ్యాచ్‌లో గెలవడం ఆస్ట్రేలియాకు తప్పనిసరైంది. వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌ సహా ఐసీసీ ఈవెంట్లలో ఎన్నోసార్లు ఆసీస్ చేతుల్లో పరాజయం పాలైన భారత్‌కు.. ఈసారి కంగారులను త్వరగా ఇంటికి పంపించేందుకు ఇదే మంచి అవకాశం.

అన్ని విభాగాల్లోనూ భారత్ పటిష్టంగా ఉంది. బంగ్లాదేశ్‌పై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. విరాట్ నుంచి ఇంకా మంచి ఇన్నింగ్స్ ఫాన్స్ కోరుకుంటున్నారు. రిషబ్‌ పంత్‌ ఫామ్‌ జట్టుకు సానుకూలాంశం. బంగ్లాపై సూర్యకుమార్‌ యాదవ్‌ విఫలమైనా.. అంతకుముందు రెండు మ్యాచ్‌ల్లో అర్ధ శతకాలు చేశాడు. బంగ్లాపై కీలక దశలో సూపర్ ఇన్నింగ్స్‌ ఆడడంతో తన విమర్శకులకు శివమ్ దూబే జవాబిచ్చాడు. ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యా అదరగొడుతున్నాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో బుమ్రా, అర్ష్‌దీప్‌ సత్తా చాటుతున్నారు. కుల్దీప్ చక్కని బౌలింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఆఫ్గాన్‌పై బ్యాటుతో ఆస్ట్రేలియా తేలిపోయింది. 149 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. హెడ్, వార్నర్, మ్యాక్స్‌వెల్‌ల మీద ఆసీస్ ఆశలు పెట్టుకుంది. కెప్టెన్‌ మార్ష్‌ ఫామ్‌ అందుకోవడం చాలా కీలకం. అఫ్గానిస్థాన్‌తో పోరులో స్టార్క్‌ను కాదని అదనపు స్పిన్నర్‌ అస్టాన్‌ అగర్‌ను తీసుకుంది. కానీ ఈ మ్యాచ్‌లో అగర్‌ను పక్కన పెట్టి.. స్టార్క్‌నే ఆడించే అవకాశముంది. కమిన్స్ ఫామ్ జట్టుకు కలిసొచ్చే అంశం. ఐసీసీ టోర్నీల్లో ఆసీస్ ఎలా ఆడుతుందో అందరికి తెలిసిందే. కాబట్టి ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు.

Also Read: OnePlus Nord CE 4 Lite 5G : వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ వచ్చేస్తుంది.. ధర, ఫీచర్స్?

తుది జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబే, హార్దిక్, అక్షర్, జడేజా, అర్ష్‌దీప్, కుల్దీప్, బుమ్రా.
ఆస్ట్రేలియా: హెడ్, వార్నర్, మార్ష్‌ (కెప్టెన్‌), మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, డేవిడ్, వేడ్, కమిన్స్, స్టార్క్, జంపా, హేజిల్‌వుడ్‌.

Show comments