Pakistan Bowler Haris Rauf responds after Heated Argument with Fan: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. పసికూన అమెరికా, చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిన పాక్.. కెనడా, ఐర్లాండ్‌పై విజయం సాధించినా మెగా టోర్నీలో ముందడుగు వేయలేకపోయింది. పాక్ వైఫల్యంపై ఆ జట్టు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ తన సతీమణితో కలిసి అమెరికా వీధుల్లో నడుస్తుండగా.. ఓ అభిమాని ట్రోల్ చేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రవూఫ్.. అతడు టీమిండియా అభిమాని అని భావించి కొట్టేందుకు వెళ్లాడు.
ఆ సమయంలో హారిస్ రవూఫ్‌ను తన సతీమణి ఆపే ప్రయత్నం చేసింది. సమీపంలో ఉన్న వేరే వ్యక్తులు కూడా అతడిని నిలువరించాలని చూశారు. సదరు అభిమాని భారతీయుడంటూ రవూఫ్ గట్టిగా అరుస్తుంటే.. తాను పాకిస్థానీనే అని అతడు చెప్పాడు. అభిమాని మీద దాడి చేయబోతున్న రవూఫ్‌ను పక్కన ఉన్న వాళ్లు అతి కష్టం మీద ఆపారు. ఈ వ్యవహారాన్ని కొందరు తమ మొబైల్‌లో వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ గొడవ చర్చనీయాంశం కావడంతో ఎక్స్ వేదికగా రవూఫ్ స్పందించాడు. తనను ట్రోల్ చేసినా భర్తిస్తానని, కుటుంబం జోలికి వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టనని పేర్కొన్నాడు.
Also Read: USA vs SA: నేటి నుంచే సూపర్-8 మొదలు.. దక్షిణాఫ్రికాతో అమెరికా ఢీ!
తన కుటుంబం గురించి మాట్లాడినందుకే తాను ఆ వ్యక్తితో గొడవ పడినట్లు హారిస్ రవూఫ్ ఎక్స్‌లో వివరణ ఇచ్చాడు. ‘ఈ విషయాన్ని సోషల్ మీడియాలోకి తీసుకురావాలనుకోలేదు. కానీ వీడియో బయటికి వచ్చి వైరల్‌గా మారింది. కాబట్టి అక్కడ ఏం జరిగిందో నేను చెప్పాలనుకుంటున్నా. ఓ ఆటగాడిగా మేం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి. కొందరు మాకు మద్దతుగా నిలుస్తారు, మరికొందరు విమర్శించొచ్చు. కానీ నా తల్లిదండ్రులు, కుటుంబం జోలికి వస్తే స్పందించకుండా ఉండలేను. వారికి తగిన రీతిలో రియాక్ట్ అవుతాను. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని గౌరవించాలి’ అని హారిస్ రవూఫ్ పేర్కొన్నాడు.
— Haris Rauf (@HarisRauf14) June 18, 2024
A heated argument between Haris Rauf and a fan in the USA. pic.twitter.com/d2vt8guI1m
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 18, 2024