Australia full squad for T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ఆరంభం కానుంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి మే 1 తుది గడువు కాగా.. అన్ని బోర్డులు తమ టీమ్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ తమ జట్లను ప్రకటించగా.. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును బుధవారం సీఏ వెల్లడించింది. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఎంపికయ్యాడు.
టెస్టు ఛాంపియన్ షిప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023లను ఆస్ట్రేలియాకు ప్యాట్ కమిన్స్ అందించాడు. కెప్టెన్సీ చేపట్టిన కొద్ది నెలల్లోనే తానేంటో నిరూపించుకున్నాడు. దాంతో టీ20ల్లో ఆసీస్‌కు మిచెల్ మార్ష్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా అతనికి అవకాశం ఇస్తారో అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే కమిన్స్‌కు షాక్ ఇస్తూ మిచెల్‌కే ఆసీస్ సారధ్య బాధ్యతలు ఇచ్చింది. ఒక సీనియర్ స్టీవ్ స్మిత్, ఫాస్ట్ బౌలర్ జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్పై వేటు పడింది.
ఐపీఎల్ 2024లో రాణిస్తున్న మార్కస్ స్టొయినిస్, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, ట్రావిస్ హెడ్‌లు టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికయ్యారు. పెద్దగా రాణించని గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్‌లు కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇటీవల టీ20లకు దూరమైన స్పిన్నర్ ఆస్టన్ అగర్‌కు జట్టులో చోటు దక్కింది. జూన్ 2 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా.. 5న బార్బడోస్ వేదికగా ఒమన్‌తో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యా భిన్నమైన ఆటగాడు.. టీ20 ప్రపంచకప్‌లో రాణిస్తాడు!
ఆస్ట్రేలియా జట్టు:
మిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోస్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోస్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.