Australia Beat Enters Super 8 after Beat Namibia: టీ20 ప్రపంచకప్ 2024లో పసికూన నమీబియాపై ఆస్ట్రేలియా పంజా విసిరింది. ముందుగా బౌలింగ్, ఆపై బ్యాటింగ్‌లో చెలరేగి సంచలన విజయం నమోదుచేసింది. ఆంటిగ్వా వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నమీబియా నిర్ధేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఒక వికెట్ కోల్పోయి 5.4 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ విజయంలో ఆడమ్ జంపా (4/12), ట్రావిస్ హెడ్ (34) కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా గ్రూప్-బీలో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8కు దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి నమీబియా ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. హాజిల్‌వుడ్, కమిన్స్, జాంపా దాటికి 43 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఓ వైపు వికెట్స్ పడుతున్నా.. గెర్హార్డ్ ఎరాస్మస్ (36; 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) ఒంటరి పోరాటం చేశారు. గెర్హార్డ్ పోరాటంతోనే నమీబియా ఆ పరుగులైనా చేయగలిగింది. మైఖేల్ వాన్ లింగేన్ (10) తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదు. జంపా నాలుగు.. హేజిల్‌వుడ్, స్టొయినిస్ చెరో రెండు వికెట్స్ పడగొట్టారు.
Also Read: Today Gold Price: మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (34 నాటౌట్; 17 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (20; 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగారు. వార్నర్ అవుట్ అనంతరం వచ్చిన మిచెల్ మార్ష్ (18 నాటౌట్, 9 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) కూడా ధాటిగానే ఆడాడు. నమీబియా బౌలర్ డేవిడ్ వైసీ ఒక వికెట్ తీశాడు.