టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ సన్నాహంగా ఉపయోగించుకుంటోంది. ఇటీవలి కాలంలో వరుస విజయాలు, డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా.. సునాయాసంగా సెమీ ఫైనల్‌కు దూసుకెళుతుందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. అయితే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం భారత్‌కు కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయని అంటున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలను తుది జట్టులోకి తీసుకునే విషయంలో ఇబ్బంది ఉంటుందని హిట్‌మ్యాన్ చెప్పాడు.
‘గత ఏడాది కాలంగా భారత్ ఎక్కువగా స్పిన్నర్లపై ఆధారపడింది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ త్రయం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయించింది. స్పిన్నర్ల విషయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు పెద్ద సవాలు ఎదురుకానుంది.వరుణ్, కుల్దీప్ ఇద్దరూ తుది జట్టులో ఉంటే.. భారత్ ఇద్దరు సీమర్లతోనే ఆడాల్సి ఉంటుంది. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం పెద్ద తలనొప్పి. అయితే కోచ్, కెప్టెన్ జట్టు కూర్పుపై నిర్ణయం తీసుకుంటారు. ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలా లేదా ఓ సీమర్‌ను డ్రాప్ చేయాలా అనేది కోచ్, కెప్టెన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’ అని రోహిత్ శర్మ వివరించాడు.
Also Read: Shivam Dube: నేను ఇప్పుడు స్మార్ట్ ప్లేయర్.. శివమ్ దూబే ఆసక్తికర వ్యాఖ్యలు!
టీ20 వరల్డ్‌కప్ 2026 మ్యాచ్‌లను మంచు ప్రభావితం చేసే అవకాశముందని రోహిత్ శర్మ చెప్పాడు. ‘వరల్డ్‌కప్ మ్యాచ్‌లపై మంచు ప్రభావం ఉంటుంది. ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్‌ను చూస్తే.. చాలా డ్యూ కనిపిస్తోంది. ఫిబ్రవరి, మార్చిల్లోనూ మంచు ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ముంబైలో పెద్దగా చలి లేకున్నా మంచు మాత్రం ఎక్కువగా ఉంటుంది. భారత్‌లోని దాదాపు అన్ని మైదానాల్లో డ్యూ ప్రభావం ఉంటుంది. ఆటగాళ్లకు ఇది ఒక ఛాలెంజ్’ అని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు.
