Site icon NTV Telugu

T20 World Cup 2026: బహిష్కరణకు అవకాశమే లేదు.. పాకిస్థాన్ తప్పక టీ20 ప్రపంచకప్‌ ఆడాల్సిందే!

Pakistan Cricket Team

Pakistan Cricket Team

భద్రత కారణాల దృష్ట్యా భారత్‌లో టీ20 వరల్డ్‌కప్ 2026 మ్యాచ్‌లు ఆడటానికి బంగ్లాదేశ్‌ నిరాకరించిన విషయం తెలిసిందే. బంగ్లాను మెగా టోర్నీ నుంచి ఐసీసీ బహిష్కరించింది. బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా తాము కూడా టోర్నీ నుంచి వైదొలుగుతామని పాకిస్థాన్ టీం కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలో పాక్ మెగా టోర్నీలో ఆడుతుందా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. టీ20 వరల్డ్‌కప్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ టోర్నీలో పాల్గొనాలా? వద్దా? అనే అంశంపై శుక్రవారం తుది నిర్ణయం ప్రకటిస్తామని పీసీబీ స్పష్టం చేసింది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ జట్టు టీ20 వరల్డ్‌కప్‌ను బహిష్కరించే అవకాశం లేదని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. వరల్డ్‌కప్‌లో పాల్గొనడంపై ఎలాంటి ఒప్పంద ఉల్లంఘన జరిగినా.. పాకిస్థాన్‌కు తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశముందని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించినట్లు సమాచారం. ఐసీసీతో కుదుర్చుకున్న పార్టిసిపేషన్ అగ్రిమెంట్‌ను ఉల్లంఘిస్తే.. పాకిస్థాన్‌పై అంతర్జాతీయ టోర్నీల నుంచి నిషేధం విధించే అవకాశముంది. అంతేకాకుండా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో విదేశీ ఆటగాళ్ల పాల్గొనడంపై కూడా ఆంక్షలు విధించే ప్రమాదం ఉందని ఐసీసీ నుంచి పీసీబీకి హెచ్చరికలు అందాయి.

Also Read: Pileru Forest Case: పీలేరు రేంజ్ అటవీ శాఖలో ఇద్దరు ఉద్యోగుల తొలగింపు

ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తగా ముందడుగు వేయాలని పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ ఆంక్షలు విదిస్తే.. పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దాంతో వరల్డ్‌కప్‌లో పాల్గొనడమే ఇప్పుడు పాక్ జట్టుకు ఉన్న ఏకైక ఆప్షన్. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్ 2026 బహిష్కరణకు దాయాది జట్టుకు అవకాశమే లేదు. పీసీబీ కూడా టోర్నీలో ఆడాలనే నిర్ణయంను ఐసీసీకి తెలియజేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం పీసీబీ తీసుకునే నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్‌కు కీలక మలుపుగా మారనుంది.

Exit mobile version