Site icon NTV Telugu

T20 World Cup Records: వరల్డ్‌కప్‌లో విజయవంతమైన ఛేజ్.. ఎలైట్ లిస్ట్‌లో పాకిస్థాన్‌కు చోటు!

Pakistan Cricket

Pakistan Cricket

టీ20 వరల్డ్‌కప్ అంటేనే.. నరాలు తెగే ఉత్కంఠ, తీవ్ర ఒత్తిడి, చివరి ఓవర్ల వరకు సాగే మ్యాచ్‌లు ఉంటాయి. ముఖ్యంగా చాలా మ్యాచ్‌లలో 19-20 ఓవర్లలో ఫలితం తేలుతుంది. చివరి రెండు ఓవర్లలో భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేయడం అంటే.. బ్యాటింగ్ జట్టు మానసిక ధైర్యం, స్కిల్, మ్యాచ్ అవగాహనకు అసలైన పరీక్ష. వరల్డ్‌కప్ చరిత్రలో ఇలాంటి ఉత్కంఠభరిత ఛేజ్‌లు కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా జరిగిన పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌ మ్యాచ్ కూడా ఉంది. 19–20 ఓవర్లలో విజయవంతంగా ఛేజ్ చేసిన అత్యధిక లక్ష్యాల రికార్డులను ఒకసారి చూద్దాం.

టీ20 వరల్డ్‌కప్‌లో 19–20 ఓవర్లలో విజయవంతంగా ఛేజ్ చేసిన జట్టుగా ఆస్ట్రేలియా ఉంది. 2010 టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌పై 34 పరుగుల లక్ష్యాన్ని చివరి వరకు పోరాడి ఛేజ్ చేసింది. ఆ నాకౌట్ మ్యాచ్‌లో ఆసీస్ చూపిన ధైర్యం అప్పట్లో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ జాబితాలో రెండో స్థానంలో వెస్టిండీస్, భారత్ ఉన్నాయి. 2014లో మిర్‌పూర్‌లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ 31 పరుగుల లక్ష్యాన్ని 19వ ఓవర్లో పూర్తి చేసింది. 2022 టీ20 వరల్డ్‌కప్‌లో మెల్‌బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల లక్ష్యాన్ని చివరి ఓవర్లలో ఛేజ్ చేసి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ ఇప్పటికీ టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యుత్తమ గేమ్‌లలో ఒకటిగా నిలిచింది.

2010 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌పై శ్రీలంక 30 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేజ్ చేసింది. ఆ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు చూపిన స్థైర్యం చివరి క్షణాల వరకు మ్యాచ్‌ను ఉత్కంఠగా నిలిపింది. 2026 టీ20 వరల్డ్‌కప్‌లో కొలంబోలో నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ 29 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి ఈ ఎలైట్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో మరో చిరస్మరణీయ మ్యాచ్ 2016 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్. కోల్‌కతాలో ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్ 27 పరుగుల లక్ష్యాన్ని చివరకు ఛేజ్ చేసి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. కార్లోస్ బ్రాత్‌వైట్ వరుసగా నాలుగు సిక్సులు కొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఆ క్షణాలను ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేరు.

Also Read: Virat Kohli-India U19: మన ఆధిపత్యం కొనసాగుతోంది.. భారత్ అండర్‌-19 జట్టుకు కోహ్లీ విషెష్!

మొత్తంగా చూస్తే 19–20 ఓవర్ల వరకు వెళ్లి లక్ష్యాన్ని ఛేజ్ చేసిన ఈ మ్యాచ్‌లు టీ20 వరల్డ్‌కప్‌ను ఎంత ఉత్కంఠభరితంగా మార్చాయో చెప్పకనే చెబుతున్నాయి. ఇలాంటి మ్యాచ్‌లే పొట్టి ఫార్మాట్ క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను తెచ్చిపెడుతున్నాయి. మున్ముందు కూడా టీ20 వరల్డ్‌కప్‌లో మరిన్ని రసవత్తర మ్యాచ్‌లు జరిగే అవకాశాలు ఉన్నాయి. టీమ్స్ అన్ని చాలా పటిష్టంగా ఉండడంతో ఈ వరల్డ్‌కప్‌లోనే చివరి బంతి వరకు మ్యాచ్‌లు వెళ్లనున్నాయి.

Exit mobile version