NTV Telugu Site icon

T20 Worldcup 2022: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐనాక్స్‌లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు

Inox T20 World Cup

Inox T20 World Cup

T20 Worldcup 2022: ఈనెల 23 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే అన్ని పనులు ఆపుకుని మరీ టీవీల ముందు అతుక్కుపోతుంటాం. మరి అలాంటి మ్యాచ్ థియేటర్లలో వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్‌ను థియేటర్లలో చూసే అవకాశాన్ని మల్టీప్లెక్సులు కల్పించబోతున్నాయి. ఈ మేరకు ఐసీసీతో ఐనాక్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఆడే మ్యాచ్‌లను దేశవ్యాప్తంగా 25కు పైగా నగరాల్లో ఐనాక్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మ్యాచ్‌లను థియేటర్‌లో పెద్ద స్క్రీన్‌పై చూస్తే క్రికెట్ మైదానంలో లైవ్‌గా మ్యాచ్‌లను చూస్తున్న అనుభూతి కలుగుతుందని ఐనాక్స్ సంస్థ చెబుతోంది. దేశ వ్యాప్తంగా మొత్తం 70 నగరాల్లో దాదాపు వెయ్యి స్క్రీన్‌ల వరకు ఐనాక్స్ నిర్వహణలో ఉన్నాయి.

Read Also: BCCI: బీసీసీఐ నుంచి గంగూలీ అవుట్.. ఐపీఎల్ ఛైర్మన్ పదవినీ తిరస్కరించిన దాదా

ఐనాక్స్‌లో మ్యాచ్ చూడాలనుకుంటే రూ.200 నుంచి రూ.500 వరకు టిక్కెట్ ధర ఉంటుందని తెలుస్తోంది. కాగా టీ20 వరల్డ్ కప్‌లో ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్లు ప్రాక్టీస్ కోసం వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. టీమిండియా ఈనెల 17, 18 తేదీల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో మ్యాచ్‌లు ఆడనుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉదయం 8:30 గంటలకు, న్యూజిలాండ్‌తో మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లైవ్ టెలికాస్ట్ చేయనుంది. క్రికెట్ అభిమానులు ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్‌లను కూడా టీవీలో లైవ్‌గా వీక్షించవచ్చు.

Show comments