Site icon NTV Telugu

Team india: శ్రీలంకతో టీ20 సిరీస్‌కు మరో కీలక ఆటగాడు దూరం

గురువారం నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు ముందే టీమిండియాకు షాక్ తగిలింది. అద్భుత ఫామ్‌లో ఉన్న కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ శ్రీలంకతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తూ సూర్యకుమార్ యాదవ్ గాయపడినట్లు జట్టు వర్గాలు చెప్తున్నాయి. దీంతో అతడు శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉంటాడని.. అతడి స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయలేదని వివరణ ఇచ్చాయి.

కాగా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. మూడో టీ20లో 31 బంతుల్లోనే 7 సిక్సులు, ఒక ఫోర్ బాది 65 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో మంగళవారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌కు అతడు హాజరుకాకపోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అయితే సూర్యకుమార్ యాదవ్‌కు తగిలిన గాయంపై స్పష్టమైన సమాచారం లేదు. అతడికి ఎక్కడ గాయమైంది? గాయం తీవ్రత ఎంత అనే విషయాలను టీమిండియా యాజమాన్యం వెల్లడించలేదు. ఇప్పటికే శ్రీలంకతో టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, పంత్ వంటి కీలక ఆటగాళ్లు దూరం కాగా.. ఇప్పుడు ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ కూడా తప్పుకోవడం టీమిండియాకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.

Exit mobile version