Suryakumar Yadav: ఒత్తిడి లేకపోతే మజా ఏముంటుంది?.. ఫైనల్ ముందు సూరీడు ఆసక్తికర వ్యాఖ్యలు!

  • భారత్–న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌
  • ఫైనల్ ముందు సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • ఒత్తిడి లేకపోతే మజా ఏముంటుంది?
Suryakumar Yadav Press Conference

Suryakumar Yadav Press Conference

Suryakumar Yadav on Pressure Before IND vs NZ T20 World Cup 2026 Final: భారత్–న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. మ్యాచ్‌కు ముందు జట్టు సిద్ధత, వ్యూహాలు, ప్లేయింగ్ కాంబినేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్‌పై ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశాడు. సన్నద్ధత సమయంలోనే ఒత్తిడిని అనుభవిస్తే మ్యాచ్‌లో ఇబ్బంది ఉండదని, ఒత్తిడి లేకపోతే మజా ఏముంటుంది? అని అన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటే.. ఒత్తిడిని జయించడం అంత సులువు అవుతుందని సూరీడు చెప్పుకొచ్చాడు.

ఫైనల్ మ్యాచ్‌లోనూ జట్టు నాణ్యమైన బ్యాటింగ్ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తుందని సూర్యకుమార్ తెలిపాడు. ‘మేము 250 పరుగులు చేస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ ముందుగా అలాంటి లక్ష్యాలు పెట్టుకుని ప్రణాళికలు చేయడం లేదు. పిచ్ పరిస్థితులను బట్టి ఆటలో మార్పులు చేసుకుంటాం. నేను, జట్టు సభ్యులు, కోచింగ్ స్టాఫ్, అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. గత ఆరేళ్లుగా నా క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. ఇలాంటి పెద్ద టోర్నమెంట్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని సూర్యకుమార్ తెలిపాడు.

ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఒత్తిడి గురించి మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికరంగా స్పందించాడు. ‘క్లిష్ట పరిస్థితుల్లో మనం ఎంత ప్రశాంతంగా ఉంటే ఒత్తిడిని అంత సులభంగా జయించగలం. సన్నద్ధత సమయంలోనే ఒత్తిడిని అనుభవిస్తే మ్యాచ్ సమయంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. అసలు ఒత్తిడి లేకపోతే మజా ఏముంటుంది?’ అని నవ్వుతూ చెప్పాడు. ‘జట్టులోని ఆటగాళ్ల మధ్య మంచి అనుబంధం ఉంది. జట్టులో అందరం ఒక కుటుంబంలా ఉంటాం. పరస్పరం మాట్లాడుకుంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాం’ అని సూర్య పేర్కొన్నాడు.

జట్టు తుది ఎంపికపై సూర్యకుమార్ యాదవ్ తన అభిప్రాయం వెల్లడించాడు. ‘ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక ఎప్పుడూ కఠినమైన నిర్ణయమే. ప్రధాన కోచ్‌తో కలిసి పరిస్థితులను విశ్లేషించి నిర్ణయం తీసుకుంటాం. జట్టుకు ఉపయోగపడే ఆటగాళ్లను ఎంపిక చేస్తాం. ద్వైపాక్షిక సిరీస్‌లలో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలతో కూడిన కూర్పు బాగా వర్కౌట్ అయింది. అందుకే సంజుకు అవకాశం ఇచ్చాం. సంజు రాకతో అంతా మారిపోయింది. అతను చేసిన కష్టానికి ఇదే సరైన గుర్తింపు’ అని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. మరికొన్ని గంటల్లో భారత్–న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది.