Suryakumar Yadav Out From Mumbai Ranji Team: టీమిండియా టీ20 జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు మరో షాక్ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాలో చోటు కోల్పోయిన సూర్య.. ఇప్పుడు ముంబై రంజీ జట్టులోనూ స్థానం కోల్పోయాడు. అక్టోబర్ 11న చండీగఢ్‌తో జరిగే మ్యాచ్ కోసం ప్రకటించిన ముంబై జట్టులో సూర్యకుమార్‌ను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. సూరీడు సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నప్పటికీ.. ముంబై సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మ్యాచ్ ప్రాక్టీస్ లేదనే:
రెడ్ బాల్ క్రికెట్‌లో తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లేదన్న కారణంతోనే సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయలేదని ముంబై సెలెక్షన్ కమిటీ చైర్మన్ రమేశ్ పవార్ తెలిపారు. సూర్య గత 18 నెలలుగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడలేదని, ముందుగా కొన్ని రెడ్ బాల్ మ్యాచ్‌లు ఆడి రిథమ్‌లోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముంబై తరఫున సూర్య కీలక ఆటగాడేనని, సరైన మ్యాచ్ ప్రాక్టీస్ వచ్చిన తర్వాత జట్టులోకి తీసుకుంటామని పవార్ వివరించారు. ముంబై సెలెక్టర్లు 19 ఏళ్ల యువ బ్యాటర్ అయుష్ మాత్రేకు కీలక బాధ్యతలు అప్పగించారు. చండీగఢ్‌తో రంజీ మ్యాచ్‌కు అతడిని వైస్ కెప్టెన్‌గా నియమించారు. భవిష్యత్తులో కెప్టెన్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముంబై జట్టులో జైస్వాల్:
కేవలం 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అయుష్ మాత్రే అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్‌కు నాయకత్వం వహించి టైటిల్ అందించడంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. టీమిండియా టెస్ట్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై జట్టులో చోటు దక్కించుకున్నాడు. చండీగఢ్‌తో మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉంటానని చెప్పడంతో.. 16 మంది సభ్యుల జట్టులో అతడిని ఎంపిక చేశారు. నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు రంజీ మ్యాచ్‌లు యశస్వికి కీలకమైన మ్యాచ్ ప్రాక్టీస్‌ను అందించనున్నాయి.
సూర్యకుమార్ యాదవ్ చివరిసారిగా జూన్‌లో ముంబై టీ20 లీగ్‌లో ఆడాడు. రమేశ్ పవార్ నేతృత్వంలోని ముంబై సెలెక్షన్ కమిటీకి సూర్య తన లభ్యతను తెలియజేసినప్పటికీ.. అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. ఇటీవల భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి కూడా సూర్యను తప్పించారు. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ సెలెక్టర్లు బాధ్యతలు అప్పగించారు.
ముంబైకి మరో ఎదురుదెబ్బ:
ముంబై సీనియర్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఉన్నప్పటికీ.. అయుష్ మాత్రేను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. ముంబై క్రికెట్‌లో భవిష్యత్ నాయకత్వానికి అయుష్‌ను సిద్ధం చేసే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై జట్టుకు మరో ఎదురుదెబ్బ కూడా తగిలింది. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ చేతి వేలికి ఫ్రాక్చర్ కావడంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అయుష్ కూడా ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న సమయంలో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో దాదాపు ఐదు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవల ఫిట్‌నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి కంగా లీగ్‌లో ఆడాడు. ఓపెనర్ దివ్యాంశ్ సక్సేనా కూడా ముంబై రంజీ జట్టులోకి తిరిగి వచ్చాడు. ప్రీ-సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో అతడికి అవకాశం లభించింది. 2020 అండర్-19 ప్రపంచకప్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి ఆడిన దివ్యాంశ్.. ఇప్పుడు మరోసారి ముంబై జట్టులో చోటు సంపాదించాడు.
గ్రూప్-డిలో ముంబై:
42 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై.. ఈసారి ఎలైట్ గ్రూప్-డిలో ఉంది. గ్రూప్-డిలో రాజస్థాన్, తమిళనాడు, రైల్వేస్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లతో కలిసి ముంబై ఉంది. తొలి మ్యాచ్‌లో చండీగఢ్‌తో ముంబై తలపడనుంది. సూర్యకుమార్‌కు జట్టు నుంచి దూరం కావడం కెరీర్‌లో మరో ప్రతికూల పరిణామంగా మారగా.. యువ ఆటగాడు అయుష్ మాత్రేకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ముంబై క్రికెట్‌లో కొత్త తరానికి ప్రాధాన్యత ఇస్తున్న సంకేతంగా కనిపిస్తోంది.

