ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఎంత పేలవ ప్రదర్శన కనబర్చిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఐదుసార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన ఈ జట్టు, మునెపెన్నడూ లేనంత దారుణంగా ఈ సీజన్‌లో రాణిస్తోంది. అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్ళందరూ దాదాపు విఫలమయ్యారు.. ఒక్కరు తప్ప! అతడే.. సూర్య కుమార్ యాదవ్. మొదట్నుంచి ముంబై జట్టులో ఇతనొక్కడే బాగా ఆడుతున్నాడు. చాలా కసితో ఆడుతున్న ఇతగాడు, జట్టులోనే అత్యంత కీలకమైన బ్యాట్మ్సన్.
అలాంటి సూర్య కుమార్ యాదవ్, ఇప్పుడు ఈ సీజన్ మొత్తం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మే 6వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, యాదవ్ ఎడమ చేయి కండరానికి గాయమైంది. ఆ గాయం నుంచి త్వరగానే కోలుకుంటాడని అంతా అనుకున్నారు కానీ, అది మరింత తీవ్రమైంది. విశ్రాంతి తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో, ఈ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు ఇతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. ఇంతవరకూ ఇతను ఉండడం వల్లే ముంబై కాస్తోకూస్తో లాక్కొచ్చింది. ఇప్పుడు ఇతని లేని లేటు, జట్టుపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం.
సీజన్ ప్రారంభంలోనూ సూర్య కుమార్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకొని జట్టులోకి ఎంట్రీ ఇచ్చి, తనదైన ఆటశైలితో అద్భుతంగా రాణించాడు. జట్టు సమస్యల్లో ఉన్నప్పుడల్లా, మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకి మంచి స్కోర్ తెచ్చిపెట్టాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ 303 పరుగులు సాధించాడు. కాగా.. ముంబై ఈ సీజన్‌లో ప్లేఆఫ్ ఛాన్సుని ఎప్పుడో కోల్పోయింది. గెలిచినా, ఓడినా.. ఎలాంటి ప్రయోజనం లేదు.