Site icon NTV Telugu

Virat Kohli: విరాట్ సింహా కోహ్లీ.. చేజింగ్‌లో ఓడిపోవడం నా బయోడేటాలోనే లేదు

Veera Simha Kohli

Veera Simha Kohli

Star Sports Telugu Repalced Veera Simha Reddy Poster With Virat Kohli: చివరివరకూ వీరోచితంగా పోరాడి, పాకిస్తాన్‌పై భారత్‌ను గెలిపించడంతో.. విరాట్ కోహ్లీకి సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. భారతీయ అభిమానులు, మాజీలు, ప్రత్యర్థులతో పాటు విమర్శకులు కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇన్నాళ్లూ ఫామ్‌లో లేడని పెదవి విరిచిన వాళ్లు.. ఈరోజు కోహ్లీకి జేజేలు కొడుతున్నారు. ఐసీసీ తన ట్విటర్ ఖాతాలో.. ‘కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ కింగ్‌లా కూర్చీపై కూర్చున్న ఒక ఫోటోతో అతనికి సలాం కొట్టింది. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా.. కోహ్లీ ఫామ్‌ని మెచ్చుకున్నాడు. ఫామ్‌ కన్నా క్లాస్‌ శాశ్వతమని తన ప్రదర్శనతో కోహ్లీ నిరూపించాడని, విమర్శకులకు సరైన సమాధానం ఇచ్చాడని కొనియాడాడు.

ఇక ‘స్టార్ స్పోర్ట్స్ తెలుగు’ అయితే.. అందరి కంటే భిన్నంగా కోహ్లీని ప్రశంసించింది. బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి పోస్టర్‌ని ఎడిట్ చేసి.. బాలయ్య స్థానంలో కోహ్లీని పెట్టి.. కిలోమీటర్ రాయి మీద ‘కింగ్’ క్యాప్షన్‌తో పాటు అతడు పాకిస్తాన్‌పై చేసిన స్కోర్‌ని మెన్షన్ చేసింది. అంతేకాదు.. టైటిల్‌కి తగినట్టుగా విరాట్ కోహ్లీ పేరుని విరాట్ సింహా కోహ్లీగా మార్చి, ‘‘చేజింగ్‌లో ఓడిపోవడం నా బయోడేటాలోనే లేదు’’ అనే క్యాప్షన్ పెట్టింది. చూడ్డానికి వారెవ్వా అనిపించేలా ఉన్న పోస్టర్‌ని స్టార్ స్పోర్ట్స్ తెలుగు తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయడమే ఆలస్యం.. వెంటనే వైరల్ అయ్యింది. సరైన సమయంలో పర్ఫెక్ట్ ఎడిట్‌తో పెట్టారని ఫ్యాన్స్ కొనియాడుతూ.. ఆ పోస్టర్‌ని తెగ షేర్ చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్ష్యం మరీ పెద్దది కాకపోవడంతో.. భారత్ సునాయాసంగా దీన్ని చేధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, వెనువెంటనే నాలుగు వికెట్లు కోల్పోవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ఇక గెలవడం దాదాపు కష్టమేనని అనుకుంటున్న తరుణంలో.. హార్దిక్ పాండ్యా సహకారంతో విరాట్ కోహ్లీ విజృంభించాడు. క్రీజులో చివరివరకూ నిలబడి, భారత జట్టుని అపురూపమైన విజయాన్ని అందించాడు.

Exit mobile version