Site icon NTV Telugu

Srilanka Board: అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన క్రికెటర్‌‌పై సస్పెన్షన్ వేటు

Guna Tilaka

Guna Tilaka

Srilanka Board: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక ఆటగాడు చిక్కుల్లో పడ్డాడు. అత్యాచార‌ ఆరోప‌ణ‌ల‌ కారణంగా ధనుష్క గుణతిలకను ఆస్ట్రేలియాలోని సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన 29 ఏళ్ల మహిళను రోజ్‌ బేలోని ఇంట్లో కలిసిన గుణతిలక ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో స్పష్టం చేశారు. ఈ మేరకు అతడు అరెస్ట్ కావడంతో ధ‌నుష్క గుణ‌తిల‌క‌ను అన్ని ఫార్మాట్ల నుంచి స‌స్పెండ్ చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డ్ ప్రక‌టించింది. జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు అత‌డి పేరును ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోబోమ‌ని ప్రక‌టించింది ఈ స‌స్పెన్షన్‌ త‌క్షణ‌మే అమ‌లులోకి వ‌స్తుంద‌ని శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. గుణ‌తిల‌క దోషిగా తేలితే అత‌డిపై క‌ఠిన శిక్షను తీసుకోవ‌డానికి వెనుకాడ‌బోమ‌ని స్పష్టం చేసింది. ఎలాంటి ప‌క్షపాతం లేకుండా ఆస్ట్రేలియా పోలీసుల విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ఆస్ట్రేలియాలో ప‌ర్యటించిన టీమ్‌లో గుణ‌తిల‌క గాయం కార‌ణంగా సూప‌ర్ 12 రౌండ్ మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. సూపర్-12లోనే ఇంటి ముఖం పట్టిన శ్రీలంకకు అంతలోనే మరో షాక్ తగిలింది. అత్యాచార ఆరోప‌ణ‌ల‌తో ఆదివారం నాడు గుణతిలకను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమ‌వారం పోలీసులు అత‌డిని కోర్టులో హాజ‌రుప‌రిచారు. బెయిల్ కోసం అత‌డు పెట్టుకున్న అప్పీల్‌ను కోర్టు తిర‌స్కరించిన‌ట్లు తెలిసింది. కాగా గుణ‌తిల‌క అరెస్ట్ కావ‌డంతో అత‌డిని అక్క‌డే వ‌దిలేసి మిగిలిన జ‌ట్టు స‌భ్యులు శ్రీలంక చేరుకున్నారు. తన కెరీర్‌లో 8 టెస్టులు, 47 వన్డేలు, 46 టీ20లను గుణతిలక ఆడాడు.

Read Also: టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్‌లలో ఆధిపత్యం ఎవరిది?

శ్రీలంక క్రికెటర్ గుణతిలకకు వివాదాల్లో చిక్కుకోవడం ఇదేమీ కొత్త కాదు. 2017లో అనుచిత ప్రవర్తన, ట్రైనింగ్ సెషన్‌కు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరు కావడంతో ఆరు వన్డేల సస్పెన్షన్ విధించారు. 2018లో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆరు నెలలు క్రికెట్ ఆడకుండా నిషేధించారు. గత ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో బయోబబుల్ బయటకు రావడంతో మరో ఆరు నెలలు సస్పెండ్ చేశారు.

Exit mobile version