Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!

  • ఆమె లేకపోతే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని
  • స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జైలుకు
  • న్యాయ పోరాటంలో భార్య కుటుంబం అండ
  • తీహార్ జైలు జీవితమే నాకు పాఠం
Sreesanth Tihar Jail Experience

Sreesanth Tihar Jail Experience

S Sreesanth Tihar Jail Experience: భారత క్రికెట్ చరిత్రలో రెండు ఐసీసీ ప్రపంచకప్‌లు గెలిచిన అరుదైన ఆటగాళ్లలో మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ ఒకరు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడిగా ఉన్న శ్రీశాంత్.. తన కెరీర్‌లో ఎన్నో అద్భుత విజయాలను అందుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మాజీ డేంజర్ ఓపెనర్ మాథ్యూ హెడెన్‌ను కూడా మొదటి ఓవర్లో పరుగులు చేయనివ్వలేదు. అంతటి గొప్ప పేసర్ శ్రీశాంత్ కెరీర్ 2013లో ఒక్కసారిగా కుదేలైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీశాంత్.. తీహార్ జైలులో గడిపిన రోజులు, ఆ సమయంలో ఎదుర్కొన్న మానసిక వేదన గురించి వెల్లడించాడు.

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జైలుకు:

2013 ఐపీఎల్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అజిత్ చండీలా, అంకీత్ చవాన్‌లతో కలిసి శ్రీశాంత్‌ కూడా విచారణను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో 12 రోజులు ఢిల్లీ పోలీస్ కస్టడీలో, 27 రోజులు తీహార్ జైలులో గడిపాడు. చివరకు 2015లో కోర్టు అతనిపై ఉన్న ఆరోపణల నుంచి విముక్తి కల్పించింది. చాలా ఏళ్ల తర్వాత బీసీసీఐ అతడిపై ఉన్న నిషేధం ఎత్తివేసింది. అయితే అప్పటికే అతడి కెరీర్ ముగిసింది.

×
×
Ad

ఆమె వల్లే నేను బతికాను:

తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన రోజులను శ్రీశాంత్ గుర్తు చేసుకున్నాడు. తన భార్య భువనేశ్వరి దేవి తనకు మానసిక బలంగా నిలిచిందని చెప్పాడు. ‘నేను తీహార్ జైలులో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకోకుండా ఉండడానికి ప్రధాన కారణం భువనేశ్వరి. 2011 ప్రపంచకప్ గెలిస్తే ఆమెను పెళ్లి చేసుకుంటానని నేను 2010లో మాట ఇచ్చాను. ఆ మాటే నాకు ధైర్యం ఇచ్చింది. 2007లో ఆమెను తొలిసారి కలిశాను. అప్పటి నుంచి 2013 వరకు మా పరిచయం కొనసాగింది. నేను బెయిల్‌పై బయటకు రావడంలో భువనేశ్వరి కీలక పాత్ర పోషించింది’ అని శ్రీశాంత్ చెప్పాడు.

న్యాయ పోరాటంలో భార్య కుటుంబం అండ:

జైపూర్‌కు చెందిన రాజవంశీయ కుటుంబానికి చెందిన భువనేశ్వరి దేవి కుటుంబం తనకు అండగా నిలిచిందని శ్రీశాంత్ తెలిపాడు. తాను దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో కూడా వారు వెన్నంటే ఉన్నారని పేర్కొన్నాడు. ‘నన్ను అందరూ వేలెత్తి చూపుతున్న సమయంలో భువనేశ్వరి కుటుంబం నాకు అండగా నిలిచింది. న్యాయవాదులతో మాట్లాడటం నుంచి ప్రతి విషయంలోనూ ఆమె ముందుండి సహాయం చేసింది’ అని వివరించాడు.

తీహార్ జైలు జీవితమే నాకు పాఠం:

జైలు జీవితం తనను మరింత బలమైన వ్యక్తిగా మార్చిందని శ్రీశాంత్ వెల్లడించాడు. ‘ఢిల్లీ పోలీస్ సెల్‌లో 12 రోజులు, తీహార్ జైలులో 27 రోజులు గడిపిన తర్వాత సాధారణ జీవితంలో ఎదురయ్యే సమస్యలు చాలా చిన్నవిగా అనిపించాయి. కొందరు విచారణ పూర్తయ్యే వరకు సంవత్సరాల తరబడి జైలులో ఉంటారని అప్పుడే అర్థమైంది. ఆ అనుభవం నన్ను మానసికంగా చాలా బలంగా మార్చింది. జైలులో ఉన్న సమయంలో నా తల్లిదండ్రులు, మేనల్లుడు, మేనకోడలు గురించే ఎక్కువగా ఆలోచించేవాడిని. మీడియా మొత్తం నా గురించే మాట్లాడేది. ఒక నెల పాటు దేశవ్యాప్తంగా అందరి దృష్టి నాపైనే ఉంది’ అని పేర్కొన్నాడు.

2013లో వివాహ బంధం:

అన్ని వివాదాలు, కష్టాలను ఎదుర్కొన్న అనంతరం 2013లో శ్రీశాంత్, భువనేశ్వరి దేవి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్న శ్రీశాంత్.. తన జీవితంలో అత్యంత క్లిష్టమైన దశ నుంచి బయటపడటంలో భార్య పాత్ర అమూల్యమని మరోసారి గుర్తు చేసుకున్నాడు. శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. 2005 నుంచి 2011 వరకు భారత్ తరఫున ఆడాడు. మూడు ఫార్మాట్లలో 170 వికెట్స్ పడగొట్టాడు.