గేమ్ ఏదైనా.. మనోళ్లు పతకం కొట్టాల్సిందే అనుకుంటాం. గెలిస్తే… భుజాలకెత్తుకుంటాం. ఓడిపోతే.. నేలకేసి కొడతాం. ఇదే మనకు తెలిసిన పద్ధతి. ఆడేవారికి ప్రోత్సాహాన్నిద్దాం అనే ఆలోచన మాత్రం ఉండదు. విజయం సాధించాలనే ఆకాంక్ష ఎంత బలంగా ఉంటుందో.. గెలవడానికి జరిగే కసరత్తులో కనీస ప్రోత్సాహం ఉండదు. అంతర్ జిల్లా పోటీల నుంచి మొదలుకుని.. అంతర్జాతీయ గేమ్స్ వరకు అన్నింట్లో మనవాళ్లు గెలవాలనుకుంటాం. కానీ దానికి ఓ బలమైన వ్యవస్థ ఉండాలనే వాస్తవాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తాం.
ప్రపంచ జనాభాలో భారత్ స్థానం రెండు. అత్యధిక యువజన జనాభా ఉన్న దేశాలలో భారత్ దే అగ్రస్థానం. అయితే.. క్రీడారంగంలో మాత్రం మన స్థానం మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే దిగదుడుపే. 2014 ఆసియా క్రీడలు, 2018 కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో సైతం చిన్న దేశాల ముందు మన స్థానం ఎంటో చెప్పుకోలేని పరిస్థితి. నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్, ప్రపంచ నంబర్‌వన్ గేమ్ ఫుట్‌బాల్‌లో భారత పరిస్థితి దయనీయంగా తయారయ్యింది. జాతీయ క్రీడ హాకీలో సైతం భారతలో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఒలింపిక్స్‌లో 204 దేశాలు పోటీపడుతుంటే.. పతకాల పట్టికలో భారత్ స్థానం 50పైనే. చివరకు 77 దేశాల కామన్వెల్త్ గేమ్స్, 45 దేశాల ఆసియా క్రీడల్లో సైతం.. భారత పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. క్రీడా రంగంలో భారత్ ఈ వెనుకబాటు తనానికి అసలు కారణం ఏంటో చూస్తే విస్తుపోవడం మనవంతే అవుతుంది.
సంవత్సరాలు జరిగిపోతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా భారత క్రీడారంగ ప్రగతి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయ్యింది. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత్… శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో ప్రగతి సాధించింది. అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా ప్రపంచ దష్టిని ఆకర్షిస్తోంది. అయితే.. ఇదంతా నాణేనానికి ఓవైపు మాత్రమే. క్రీడాపరంగా భారత్ ప్రగతి చూస్తే.. రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అని చెప్పక తప్పదు. మన పొరుగుదేశం చైనాతో పోల్చిచూస్తే.. ఒలింపిక్స్‌లో భారత్ పరిస్థితి తీసికట్టే. జనాభాలో ప్రపంచంలోనే చైనా అతిపెద్ద దేశం. దేశ జనాభాకు తగ్గట్టుగానే క్రీడారంగంలో చైనా కళ్లు చెదిరే ప్రగతి సాధించింది. అమెరికా లాంటి సూపర్ పవర్ కే సవాలు విసిరేలా ఎదిగింది. ఒలింపిక్స్‌లో పతకాలు కొల్లగొట్టడంతో ముందు వరుసలో ఉంది. జనాభాలో రెండో స్థానంలో ఉన్న మనం ఎక్కడున్నామంటే…ఆలోచించాల్సిన పరిస్థితి.
ప్రపంచంలోని రెండు వందలకు పైగా దేశాలలో… అత్యధిక యువత ఉన్న దేశం భారత్. దేశ జనాభాలో 60శాతం మంది యువకులే. అయినా క్రీడలంటే ఏమాత్రం ఆసక్తిలేదు. వివిధ క్రీడలకు చెందిన మొత్తం 25 మంది అర్జున అవార్డీల బృందం…నిర్వహించిన ఓ సదస్సులో భారత క్రీడారంగం వెనుకబాటుకు కారణాలు, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయ్. 130 కోట్ల భారత జనాభాలో కేవలం 5.2 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి కనీస అవగాహన ఉన్నట్లుగా ఓ సర్వేలో తేలింది. జనాభాలో సగభాగం ఉన్న మహిళల్లో కేవలం 1.31 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి అవగాహన ఉందంటే ముక్కుమీద వేలేసుకోవాల్సిందే. దేశజనాభాలో 3.27శాతం మంది మాత్రమే క్రీడల గురించి తెలుసుకోడానికి ఆసక్తి చూపుతున్నట్లు పరిశీలనలో వెల్లడయ్యింది.
క్రీడలంటే ఒకప్పుడు మానసిక ఉల్లాసం కోసం ఆడే ఆటలు మాత్రమే. అయితే, ప్రపంచీకరణ పుణ్యమా అంటూ.. క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, కబడ్డీ లాంటి టీవీ ఫ్రెండ్లీ ఆటలతో.. క్రీడారంగం కూడా బహుళజాతి సంస్థల వ్యాపారంగా మారిపోయింది. క్రికెట్ అంటే ఇప్పుడు పరుగులు, వికెట్లు, క్యాచ్‌లు, రికార్డులు ఏమాత్రం కాదు. ప్రసార హక్కులు, కిట్ బ్యాగులు, లోగో హక్కులు, ఇన్ స్టేడియా హక్కులు, జట్టు, క్రీడాకారుల వ్యక్తిగత ఎండార్స్‌మెంట్లు.. ఇలా ఏది చూసినా కోట్ల రూపాయల వ్యాపారమే. క్రికెటర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ బ్యాటు పట్టి కోట్లకు పడగలెత్తినవారే. చివరకు టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు.. ఆటతో కోట్ల కోటలు కట్టినవారే. బహళజాతి సంస్థల అండదండలు, మీడియా ఫ్రెండ్లీగా ఉండే.. క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి ఒకటి రెండు క్రీడల దెబ్బకు మిగిలిన క్రీడలన్నీ విలవిలలాడి పోతున్నాయి. ప్రభుత్వాలు సైతం తమకు ఆదాయం, ప్రచారం తెచ్చిపెట్టే క్రీడల్ని, క్రీడాకారులను మాత్రమే ప్రోత్సహిస్తూ మిగిలిన క్రీడలను, క్రీడాకారులను చిన్నచూపు చూస్తున్నాయి.
దేశంలో క్రీడలు ఎన్నిరకాలు ఉన్నా.. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ స్థాయిలో జాతీయ పోటీలు నిర్వహించడం సాంప్రదాయంగా ఉండేది. ఈ పోటీల నిర్వహణ కోసం జాతీయ ఒలింపిక్ సంఘం, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖలు సహాయ సహకారాలు అందించేవి. లాభసాటి లీగ్ వ్యాపారం భారత క్రీడారంగంలోకి చొరబడటంతో జాతీయ పోటీల నిర్వహణ తూతూమంత్రంగా మారిపోయింది. భారత క్రీడారంగ మూలాలే బలహీనపడే ప్రమాదం పొంచి ఉంది. దీనికి తోడు క్రీడలు ఉమ్మడి జాబితా అంశం కావడంతో ఓ స్పష్టమైన క్రీడావిధానం అంటూ లేకపోడం భారత క్రీడా రంగాన్ని కుదేలయ్యేలా చేస్తోంది. అదీ చాలదన్నట్లుగా.. ఎనిమిదేళ్లలోపు పిల్లలను క్రీడల పట్ల ఆకర్షించేలా చేయడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, ఎలాంటి విధానాలు లేవని మాజీ క్రీడా దిగ్గజాలు అంటున్నారు.
దశాబ్దాల నాటి క్రీడామౌలిక సదుపాయాలతో భారత క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో ఎలా రాణిస్తారని మాజీ క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల అంటే సువిశాలమైన క్రీడా మైదానం, తరగతి గదులు అన్నమాట.. నేటితరం పాఠశాలలకు ఏ మాత్రం వర్తించదు. చిన్నచిన్న నగరాలు, పట్టణాలలో సింగిల్ బెడ్ రూమ్ పాఠశాలలు, డబుల్, ట్రిపుల్ బెడ్ రూం కళాశాలలను చూస్తుంటే క్రీడారంగంలో భారత్ ఏ గతిన బాగుపడుతుందన్న సందేహం రాకమానదు. ఆటలంటే ఏమిటో తెలియని నేటితరం బాలలు…పాఠశాలలు, కళాశాలలను చూసి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీస క్రీడా సౌకర్యాలు లేని పాఠశాలల్లో చదివే నేటితరానికి ఆటలు ఆడే కనీస సదుపాయాలు లేకపోవడాన్ని మించి…దారుణం ఉంటుందా ? అని భారత మాజీ క్రీడాదిగ్గజాలు, అర్జున అవార్డీలు వాపోతున్నారు. క్రీడలను సైతం నిర్భంద పాఠ్యాంశంగా ఎందుకు చేయరని ప్రశ్నిస్తున్నారు. మన సమాజం, ప్రభుత్వాలు, క్రీడావ్యవస్థ ఆలోచనా ధోరణిలో మార్పురానంత వరకూ భారత వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉంటుందని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ సంస్కృతి, స్మార్ట్ ఫోన్ విష కౌగిలి, పశ్చిమదేశాల అనుకరణలో ముందుంది మనదేశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపకుంటే క్రీడలపై ఆసక్తి చూపే వారి సంఖ్య…నానాటికి తీసికట్టుగా మారిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలోను, తెలుగు రాష్ట్రాలలోనూ వార్షిక బడ్జెట్ల సమర్పణ తంతు చూస్తే మన ప్రభుత్వాలకు క్రీడలంటే ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు…క్రీడలంటే పట్టిపట్టనట్టు వ్యవహరిస్తున్నాయ్. బడ్జెట్ కేటాయింపుల్లోనూ…చిన్నచూపుచూస్తున్నాయ్. 2021 – 22కి రూ.2596.14కోట్లు మాత్రమే క్రీడారంగానికి కేటాయించింది మోడీ సర్కార్. ఇది గత ఏడాది బడ్జెట్‌తో పోల్చిచూస్తే 230 కోట్లు తక్కువ. గతేడాది బడ్జెట్‌లో క్రీడలకు 2,826 కోట్లు కేటాయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించకుండా…అంతర్జాతీయ వేదికల్లో మనవాళ్లు పతకాలు సాధించడం సాధ్యమవుతుందా అన్నది ఆలోచించాల్సిన అంశం.
జనాభాలో రెండోస్థానంలో ఉన్న భారత్‌లో… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూపోతూ ఉన్నాయ్ తప్పా… క్రీడారంగానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అరకొర కేటాయింపులతో, విదిలింపులతోనే సరిపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు తూతూ మంత్రంగా కేటాయింపులు చేసి చేతులు దులుపుకొన్నాయి.
