NTV Telugu Site icon

IND Vs SA: భారత బౌలర్ల వైఫల్యం.. తొలి టీ20లో దక్షిణాఫ్రికా ఘనవిజయం

South Africa

South Africa

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఖంగుతింది. భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యంతో పరాజయం మూటగట్టుకుంది. భారత్ నిర్దేశించిన 212 పరుగుల టార్గెట్‌ను దక్షిణాఫ్రికా జట్టు 19.1 ఓవర్లలోనే ఛేదించింది.  దీంతో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.  ఆ జట్టు ఆటగాళ్లు డుస్సెన్ 75 నాటౌట్, డేవిడ్ మిల్లర్ 64 నాటౌట్ చెలరేగి ఆడారు. ఓపెనర్లు డికాక్ (22), బవుమా (10) విఫలమైనా 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 86 పరుగులే చేసినా సఫారీ జట్టు గెలిచిందంటే కారణం ఇద్దరే ఆటగాళ్లు.

ఐపీఎల్‌లో చక్కని ఆటతీరు కనబరిచిన డేవిడ్ మిల్లర్ ఆ ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కంటిన్యూ చేశాడు. ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్ల తేడాతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డుస్సెన్ ఐదు సిక్సర్లు, 7 ఫోర్లతో 75 పరుగులు చేసి సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీళ్లిద్దరూ సిక్సర్లు, ఫోర్లతో ఇండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్, భువనేశ్వర్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది.