T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు తొలి దెబ్బ పడింది. పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో 134 పరుగుల విజయలక్ష్యాన్ని 19.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఛేదించింది. మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో వీళ్లిద్దరూ దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించారు. మార్‌క్రమ్ 41 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 52 పరుగులు చేశాడు. మిల్లర్ 46 బంతుల్లో 59 పరుగులు చేశాడు. మిల్లర్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
Read Also: Virat Kohli: కోహ్లీ అరుదైన ఘనత.. తొలి భారత క్రికెటర్‌గా!
ఫీల్డింగ్‌లో రాణించి ఉంటే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి ఉండేది. సాధించింది స్వల్ప స్కోరే అయినా దాన్ని కాపాడుకునేందుకు టీమిండియా బౌలర్లు శక్తిమేరకు శ్రమించారు. అయితే మిల్లర్ చివర్లో అశ్విన్ బౌలింగ్‌లో కొట్టిన రెండు సిక్సులు మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాయి. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 6 పరుగులు అవసరం కాగా మొదటి మూడు బంతులు ఎంతో జాగ్రత్తగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ నాలుగో బంతిని షార్ట్ బాల్ వేసి బౌండరీ సమర్పించుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా విజయం ఖరారైంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో గ్రూప్-2లో దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. ఆ జట్టు ఖాతాలో ఐదు పాయింట్లు ఉన్నాయి. టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. భారత్ ఖాతాలో 4 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. టీమిండియా సెమీస్ చేరాలంటే మిగతా రెండు మ్యాచ్‌లలో గెలిచి తీరాలి.
