IND Vs SA: ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో కేవలం 27.1 ఓవర్లలో 99 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది. టీమిండియా ముందు 100 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే మూడు వన్డేల సిరీస్ భారత జట్టు సొంతం అవుతుంది. 34 పరుగులు చేసిన క్లాసెన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జానేమన్ మలాన్ (15), మార్కో జాన్సన్ (14) రెండంకెల స్కోరు చేయగలిగారు. మిగతా బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా వెళ్లారు.
Read Also: Coach Restaurant: రైల్వే స్టేషన్‌లో కోచ్ రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా?
బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. ముఖ్యంగా స్పిన్ బౌలర్లు తమ సత్తా చాటుకున్నారు. దక్షిణాఫ్రికా 10 వికెట్లలో 8 వికెట్లు స్పిన్నర్ల ఖాతాలోకే వెళ్లాయి. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో చెలరేగాడు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, షాబాజ్ అహ్మద్ రెండు వికెట్లు, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లతో దక్షిణాఫ్రికా వెన్ను విరిచారు. కాగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. గత రాత్రి కురిసిన వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను అరగంట పాటు ఆలస్యంగా ప్రారంభించారు. సాధారణంగా ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కానీ తేమ కారణంగా ఈ పిచ్ ఈరోజు బౌలర్లకు అనుకూలించింది. అటు వన్డేల్లో టీమిండియాపై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనించాల్సిన విషయం.
