Sourav Ganguly: బీసీసీఐ నుంచి గంగూలీ నిష్క్రమణ ఖరారైంది. గత మూడేళ్లుగా బీసీసీఐ అధ్యక్షుడిగా చక్రం తిప్పిన గంగూలీ పదవీకాలం ఈనెల 18తో ముగియనుంది. దీంతో బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా 1983 ప్రపంచకప్ హీరో రోజర్ బిన్నీ ఎన్నిక కానున్నాడు. ఈనెల 18న ముంబైలో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా బిన్నీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా రెండోసారి కూడా బీసీసీఐ కార్యదర్శిగానే కొనసాగనున్నాడు. మరోవైపు ఐసీసీ బోర్డులో బీసీసీఐ ప్రతినిధిగా కూడా గంగూలీ కొనసాగే అవకాశం కనిపించడం లేదు. ఈ స్థానాన్ని జై షా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Adani : గంగవరం 100శాతం అదానీదే.. ఆల్ క్లియర్
బీసీసీఐ తరఫున ఐసీసీ వ్యవహారాలను చక్కబెట్టడంలో జై షా ముందున్నట్లు బీసీసీఐ వర్గాలు స్వయంగా వెల్లడిస్తున్నాయి. వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఏడాది మాత్రమే ఉండటంతో ఐసీసీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో భారత్‌కు బలమైన నాయకత్వం ఉండటం చాలా ముఖ్యమని అభిప్రాయపడుతున్నాయి. అయితే బీసీసీఐ అధ్యక్షుడిగా మరో దఫా కొనసాగించేందుకు గంగూలీ ఆసక్తి కనపరిచినా అతడికి నిరాశే ఎదురైంది. అధ్యక్ష పదవిని రెండో సారి ఒకే వ్యక్తికి ఇచ్చే సంప్రదాయం లేదని గంగూలీకి బీసీసీఐ వర్గాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అటు ఐపీఎల్ ఛైర్మన్ పదవిని ఆఫర్ చేయగా దాదా తిరస్కరించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత బోర్డులోని సబ్ కమిటీకి సారథ్యం వహించడం సరికాదని గంగూలీ అభిప్రాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఐసీసీ అధ్యక్ష పదవికి గంగూలీ పేరును ప్రతిపాదిస్తారా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఐసీసీ అధ్యక్ష పదవి కూడా గంగూలీకి వచ్చే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.