Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!

Shubman Gill Pots Odi Record

Shubman Gill Pots Odi Record

Shubman Gill ODI Player of the Series Record: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’ అవార్డును సొంతం చేసుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ 334 పరుగులు చేసి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి వన్డేలో 108 బంతుల్లో 110 రన్స్ చేసిన ప్రిన్స్.. రెండో వన్డేలో 133 బంతుల్లోనే 223 పరుగులు చేశాడు. మూడో వన్డేలో 1 పరుగుతో గిల్ నిరాశపరిచినా.. భారత క్రికెట్‌లో ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

భారత్ తరఫున అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో శుభ్‌మన్ గిల్ ఇప్పుడు సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 15 అవార్డులతో అగ్రస్థానంలో ఉండగా.. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ 11 అవార్డులతో రెండో స్థానంలో ఉన్నాడు. మాజీ దిగ్గజాలు యువరాజ్ సింగ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ తలో ఏడు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’ అవార్డులతో మూడో స్థానంలో ఉన్నారు. తాజాగా ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన గిల్ చేరాడు.

అయితే శుభ్‌మన్ గిల్ సాధించిన ఏడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డుల్లో ఓ ప్రత్యేకత ఉంది. అతడి ఏడు అవార్డులన్నీ 2022 తర్వాతే రావడం విశేషం. అదే సమయంలో 2022 నుంచి ఇప్పటివరకు మరే భారత ఆటగాడు మూడు కంటే ఎక్కువ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’ అవార్డులు అందుకోలేదు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గిల్ ఎంత నిలకడగా రాణిస్తున్నాడో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం 70 మ్యాచ్‌లకే గిల్ దిగ్గజాల సరసన చోటు సంపాదించడం అంటే మాములు విషయం కాదు. ఓవైపు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు బ్యాటర్‌గా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇదే స్థాయిలో ప్రిన్స్ బ్యాటింగ్ కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

భారత్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డులు (వన్డే):
15 సచిన్ టెండూల్కర్
11 విరాట్ కోహ్లీ
7 యువరాజ్ సింగ్
7 సౌరవ్ గంగూలీ
7 MS ధోనీ
7 శుభ్‌మన్ గిల్