Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!

  • విదేశీ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలి
  • క్యాచ్‌లు వదిలేయడం భారీగా దెబ్బతీసింది
  • బౌలింగ్ వ్యూహంలోనూ తప్పిదాలు
  • భారత ఆటగాళ్లు చాలా నేర్చుకుంటారు
Shreyas Iyer Comments

Shreyas Iyer Comments

Shreyas Iyer on India defeat vs England: ఇంగ్లండ్ పర్యటనను భారత్ భారీ ఓటమితో ముగించింది. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ వేదికగా శనివారం జరిగిన ఐదో టీ20లో భారత్ 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.

విదేశీ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలి:

‘ఈ సిరీస్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంగ్లండ్‌లో ప్రతి మైదానంలో పరిస్థితులు, పిచ్ స్వభావం భిన్నంగా ఉన్నాయి. ఐదో టీ20 జరిగిన పిచ్ మాత్రం సిరీస్‌లో బ్యాటింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంది. ప్రొఫెషనల్ క్రికెటర్లుగా మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి త్వరగా అలవాటు పడటం చాలా ముఖ్యం. విదేశాల్లో మైదానాల పరిమాణాలు కూడా భిన్నంగా ఉంటాయి. వాటికి ఎంత త్వరగా అలవాటు పడితే అంత మంచిది. కానీ మేము ఈ విషయంలో చాలా వెనకపడిపోయాం’ అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

క్యాచ్‌లు వదిలేయడం భారీగా దెబ్బతీసింది:

‘టీమిండియా ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలు మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపాయి. కీలక సమయంలో రెండు క్యాచ్‌లు వదిలేయడం వల్ల ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉంటే ప్రత్యర్థిని 220 నుంచి 225 పరుగుల మధ్య కట్టడి చేసే అవకాశం ఉండేది. 258 పరుగుల భారీ లక్ష్యానికి బదులుగా 220-225 పరుగుల లక్ష్యం ఉంటే భారత్‌కు ఛేదించే అవకాశాలు ఉండేవి. ఫీల్డింగ్ మ్యాచ్‌లను గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విభాగంలో జట్టు మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది’ అని సర్పంచ్ సాబ్ స్పష్టం చేశాడు.

బౌలింగ్ వ్యూహంలోనూ తప్పిదాలు:

‘బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించిన పిచ్‌పై బౌలర్లు మరింత తెలివిగా వ్యవహరించాల్సింది. కొన్ని సమయాల్లో బంతుల ఎంపిక, వ్యూహాల అమలు మరింత మెరుగ్గా ఉండాల్సింది. బ్యాటర్లను బోల్తా కొట్టించే విధంగా బౌలింగ్‌లో వైవిధ్యం చూపించాల్సింది. జోస్ బట్లర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చిన తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్ వేగం అందుకుంది. వీరిద్దరి భాగస్వామ్యం మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు మళ్లించింది. భారీ లక్ష్య ఛేదనలో భారత్ పవర్‌ప్లేలోనే వరుసగా వికెట్లు కోల్పోవడం తీవ్రంగా దెబ్బతీసింది. భారీ లక్ష్యం ఉందనే ఒత్తిడితో ప్రతి బంతినీ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాము. దాని బదులు భాగస్వామ్యాలు నిర్మించాల్సింది’ అని అభిప్రాయపడ్డాడు.

భారత ఆటగాళ్లు చాలా నేర్చుకుంటారు:

‘ఇలాంటి బ్యాటింగ్ పిచ్‌లపై కొంత సమయం తీసుకుని పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత కొందరి బౌలర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలి. కానీ భారత బ్యాటర్లు భాగస్వామ్యాలపై దృష్టి పెట్టకుండా లక్ష్యాన్ని వేగంగా ఛేదించే ప్రయత్నంలో వరుసగా వికెట్లు కోల్పోయారు. ఇంగ్లండ్ బౌలర్లు తమ ప్రణాళికలను అద్భుతంగా అమలు చేశారు. స్వదేశీ పరిస్థితుల్లో వారికి అపారమైన అనుభవం ఉండటం కలిసొచ్చింది. సరైన లెంగ్త్‌లతో బౌలింగ్ చేస్తూ భారత బ్యాటర్లపై నిరంతరం ఒత్తిడి కొనసాగించారు. ఈ పర్యటనలో ఎదురైన అనుభవాల నుంచి భారత ఆటగాళ్లు చాలా నేర్చుకుంటారు. భవిష్యత్తులో విదేశీ పరిస్థితుల్లో ఆడేటప్పుడు పిచ్‌లకు త్వరగా అలవాటు పడటం, ఫీల్డింగ్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోవడం కీలకం’ అని శ్రేయస్ స్పష్టం చేశాడు.