Shreyas Iyer: కేక్‌పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!

  • భారత టీ20 జట్టులో కీలక మార్పులు
  • కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్
  • కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన సర్పంచ్ సాబ్
Shreyas Iyer Reaction

Shreyas Iyer Reaction

Shreyas Iyer Reacts to India T20 Captaincy: భారత టీ20 జట్టులో కీలక మార్పులకు తెరలేచిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ 2026 విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ కొత్త సారథిగా నియమించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల జట్లకు కూడా శ్రేయస్ నాయకత్వం వహించనున్నాడు. సూర్యను సారథిగా తప్పించడమే కాకుండా.. జట్టులో కూడా చోటు ఇవ్వలేదు. ఈ నిర్ణయం భారత క్రికెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే టీమిండియా కెప్టెన్సీపై శ్రేయస్ తొలిసారి స్పందించాడు. దేశానికి నాయకత్వం వహించడం గొప్ప గౌరవం అని సర్పంచ్ సాబ్ పెట్టుకొన్నాడు.

ఎంతో గౌరవంగా భావిస్తున్నాను:
ముంబై టీ20 లీగ్‌లో సోబో ముంబై ఫాల్కన్స్ తరఫున ఆడుతున్న శ్రేయస్ అయ్యర్.. భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికైన రోజే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. శనివారం (జూన్ 6) ట్రయంఫ్ నైట్స్ ఎంఎన్‌ఈతో జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టుకు ఐదు వికెట్ల విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ టీమిండియా నాయకత్వ బాధ్యతలు రావడం తనకు ఎంతో గర్వకారణమని తెలిపాడు. ‘ఇది అద్భుతమైన అనుభూతి. దేశానికి ప్రాతినిధ్యం వహించడం, జట్టుకు నాయకత్వం వహించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. నాకు ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు మైదానంలో బాగా ఆడాను. జట్టుకు అవసరమైన పరుగులు చేసి విజయాన్ని అందించాను. కెప్టెన్సీ రావడం ఆ ఆనందానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఇది కేక్‌పై ఐసింగ్‌ లాంటిది’ అని చెప్పాడు.

×
×
Ad

అభిమానుల ప్రేమ మరువలేను:
శ్రేయస్ అయ్యర్ తన అభిమానులకు ప్రత్యేక సందేశం కూడా ఇచ్చాడు. ‘నా అభిమానులు ఎప్పుడూ నన్ను ప్రోత్సహించారు. ఎన్నో సంవత్సరాలుగా వారు చూపిస్తున్న ప్రేమ, మద్దతు అమోఘం. వారి అభిమానానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. వారిపై నా ప్రేమ, గౌరవం ఎప్పుడూ ఉంటుంది’ అని శ్రేయస్ చెప్పాడు. కెప్టెన్సీ మార్పు జరిగిన కొద్ది గంటల్లోనే సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ ముంబై టీ20 లీగ్‌లో తలపడ్డారు. మ్యాచ్ టాస్ సమయంలో ఇద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. కెప్టెన్సీ కోల్పోయినప్పటికీ ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయకుండా సూర్య హుందాతనాన్ని ప్రదర్శించాడు.

నాకు చాలా సంతోషంగా ఉంది:
టాస్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘శ్రేయస్ భారత టీ20 జట్టు కెప్టెన్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేమిద్దరం ముంబై తరఫున ఎన్నో సంవత్సరాలు కలిసి క్రికెట్ ఆడాం. వరుసగా ముగ్గురు ముంబై కెప్టెన్లు భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించడం ముంబై క్రికెట్‌కు ఎంతో గర్వకారణం. ఇది అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం’ అని సూర్యకుమార్ తెలిపాడు. కొత్త టీ20 యుగానికి టీమిండియా సిద్ధమవుతున్న వేళ.. ఈ మార్పులు భారత క్రికెట్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.