NTV Telugu Site icon

Shoib Akthar: అక్తర్ నోటి దురుసు.. వచ్చేవారం ఇండియా కూడా ఇంటికి రావడం ఖాయం

Shoib Akthar

Shoib Akthar

Shoib Akthar: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడటంతో తర్వాతి మూడు మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ గెలిచినా సెమీస్ అవకాశం దక్కుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. పాకిస్థాన్ దాదాపుగా ఇంటికి వెళ్లినట్లే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అద్భుతాలు జరిగితే తప్ప పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశం దక్కేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ నుంచి వరుస ఓటములు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఫైర్ అవుతున్నాడు. తాజాగా టీమిండియాపై కూడా అక్తర్ తన అక్కసు వెళ్లగక్కాడు. తన జట్టు ఓడిపోతుందన్న బాధ కాకుండా టీమిండియా ఓడిపోవాలని కోరుకుంటున్నాడు. ఈ మేరకు భారత్ తీస్ మార్ ఖాన్ ఏం కాదని, వచ్చే వారమే ఆ జట్టు కూడా ఇంటికి వచ్చేస్తుందని అక్తర్ జోస్యం చెప్పాడు.

Read Also: Ravichandran Ashwin: అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ బంతి వైడ్ కాకుంటే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేవాడిని..!!

అటు టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ భవితవ్యం ఏంటో టోర్నీకి ముందే చెప్పానని షోయబ్ అక్తర్ గుర్తుచేశాడు. అందరూ అనుకున్నట్లుగానే పాకిస్థాన్ ఇంటిముఖం పట్టిందని.. టీమిండియాకు కూడా ఇదే గతి పడుతుందని అక్తర్ ప్రకటించాడు. అంటే టీమిండియా సెమీస్‌కు వెళ్లి అక్కడి నుంచి ఓడిపోయి ఇంటికి చేరుతుందని అక్తర్ అభిప్రాయపడుతున్నాడు. కానీ చాలా మంది అభిమానులు భారత్ ఈ ప్రపంచకప్ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు పాకిస్థాన్ సెలక్టర్లు ఈ ప్రపంచకప్‌కు సరైన ఆటగాళ్లను ఎంపిక చేయలేదని అతడు ఆరోపించాడు. పీసీబీ దీనికి బాధ్యత వహించాలని అక్తర్ డిమాండ్ చేశాడు. కాగా జింబాబ్వే చేతిలో ఓటమిని పాకిస్థాన్ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్థాన్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ జింబాబ్వేతో మ్యాచ్ అనంతరం బోరున కన్నీటిపర్యంతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షాదాబ్ ఖాన్ కింద కూర్చుని ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని బోరున విలపించడం వీడియోలో కనిపిస్తోంది.