Site icon NTV Telugu

Shoaib Akhtar: కోహ్లీ.. నీ భార్యపై కామెంట్స్ పట్టించుకోకు

Shoaib Supports Virat Kohli

Shoaib Supports Virat Kohli

కొంతకాలం నుంచి ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేడు. పోనీ ఐపీఎల్‌లో అయినా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడనుకుంటే.. ఆ టోర్నీలోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు అర్థసెంచరీలు మినహాయిస్తే, అతడు ఎలాంటి మెరుపులు మెరిపించలేదు. ముఖ్యంగా.. అత్యంత కీలకమైన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో కోహ్లీ ఏమాత్రం సత్తా చాటకుండా త్వరగా ఔటవ్వడంతో తీవ్రంగా నిరాశ చెందారు. దీంతో, అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇయాన్ బిషప్, సెహ్వాగ్, డేనియల్ వెటోరీ వంటి మాజీ ఆటగాళ్ళు సైతం కోహ్లీని విమర్శించారు. నెటిజన్లైతే వ్యక్తిగతంగానూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతనికి మద్దతుగా పాక్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ ముందుకొచ్చాడు.

కోహ్లీ ఫామ్‌లో లేని విమర్శించే వాళ్ళందరూ.. ఒక్కసారి అతడు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలని అఖ్తర్ అన్నాడు. ఓ క్రికెటర్‌గా, అత్యుత్తమ ఆటగాడిగా గౌరవం పొందే అర్హత కోహ్లీకి ఉందన్నాడు. ‘‘కోహ్లీని విమర్శించే ముందు కాస్త ముందూ వెనుకా ఆలోచించాలి. చిన్న పిల్లలు కూడా ఈ విషయాల్ని గమనిస్తుంటారు. కాబట్టి కోహ్లి గురించి, అతడి ఆట గురించి కాస్త మంచి మాటలు చెప్పండి. గౌరవం పొందేందుకు అతడు అన్ని విధాలా అర్హుడు. అతడో ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ ప్లేయర్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ 110 సెంచరీలు చేయాలని నేను కోరుకుంటున్నా. 45 ఏళ్లు వచ్చే వరకు కోహ్లి క్రికెట్‌ ఆడుతూనే ఉండాలి’’ అంటూ విమర్శకులకు అఖ్తర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

ఇదే సమయంలో.. ‘‘కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నపుడు కొంతమంది నిన్ను విమర్శిస్తారు. నీకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తారు. నువ్వు దీపావళి గురించి ట్వీట్‌ చేసినా, అందులో తప్పులు వెతుకుతారు. నీ భార్య, బిడ్డ గురించి కూడా కామెంట్లు చేస్తారు. నువ్వు వరల్డ్‌కప్‌లో ఓడిపోతే, దారుణంగా తిడతారు. ఇలాంటిన్నీ పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదు. నీదైన శైలిలో ముందుకు దూసుకెళ్లు.. విరాట్‌ కోహ్లి అంటే ఏంటో విమర్శకులకు ఒక్కసారి చూపించు’’ అంటూ కోహ్లీలో జోష్ నింపే వ్యాఖ్యలు చేశాడు షోయబ్ అఖ్తర్. ఓ పాక్ క్రికెటర్ ఈ విధంగా భారతీయ ఆటగాడికి మద్దతివ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Exit mobile version