Shikhar Dhawan About 2023 ODI World Cup: శిఖర్ ధావన్ నాయకత్వంలో టీమిండియా.. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. ఈరోజు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ధావన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘నా కెరీర్ చాలా బాగా సాగుతోంది. అందుకు నేను కృతజ్ఞుడిని. నా అనుభవాన్ని యువ ఆటగాళ్లకు చెప్పేందుకు నేనెప్పుడూ సిద్ధమే. ఇప్పుడు నాపై కొత్త బాధ్యతలు ఉన్నాయి కాబట్టి.. దీన్ని ఒక అవకాశం తీసుకొని సవాళ్లను ఎదుర్కొంటా. అయితే.. నా ప్రధాన లక్ష్యం మాత్రం 2023 వన్డే వరల్డ్‌కప్. దాని కోసం ఫిట్‌గా ఉండటంతో పాటు నా మనస్సుని మంచి స్థితిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా’’ అంటూ ధావన్ చెప్పుకొచ్చాడు. కాగా.. ఇప్పటికే ధావన్ నాయకత్వంలో శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే జట్లతో జరిగిన వన్డే సిరీస్‌లను భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే!
ఇదే సమయంలో.. ఈ వన్డే సిరీస్ ద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అడుగుపెట్టబోతున్న రజత్ పాటిదార్, తన ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశాడు. అలాగే.. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రోల్ మోడల్స్ అని పేర్కొన్నాడు. కోహ్లీతో కలిసి తాను లీగ్‌లో మంచి భాగస్వామ్యాలు నిర్మించానని, ఆఫ్ ఫీల్డ్‌లోనూ తన బ్యాటింగ్ గురించి ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడినని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కోహ్లీ సలహాలు తనకెంతో సహాయపడ్డాయని.. వాటిని మ్యాచుల్లో అమలు చేసి, తన బ్యాటింగ్‌ను మరింత మెరుగుపర్చుకున్నానని తెలిపాడు. అభిమాన ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకుంటే వచ్చే అనుభూతి జీవితాంతం మరిచిపోలేమని.. వారి నుంచి ఎన్నో విషయాల్ని నేర్చుకోవచ్చని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
