Site icon NTV Telugu

Shakib Al Hasan: టీమిండియాపై బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ అరుదైన రికార్డు

Shakib Al Hasan

Shakib Al Hasan

Shakib Al Hasan: టీమిండియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన తొలి వన్డేలో అతడు 10 ఓవర్లు వేసి 36 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడెన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వన్డేల్లో టీమిండియాపై ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా షకీబుల్ హసన్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఎనిమిదో స్పిన్నర్‌గా నిలిచాడు. గతంలో టీమిండియాపై 5 వికెట్లు సాధించిన స్పిన్నర్లలో ముస్తాక్ అహ్మద్, సక్లైన్ ముస్తాక్, ముత్తయ్య మురళీధరన్, యాష్లే గైల్స్, అజంతా మొండిస్, సయీద్ అజ్మల్, అకిల ధనంజయ మాత్రమే ఉన్నారు.

Read Also: Andhra Pradesh: నేడు రాయలసీమ గర్జన.. కర్నూలులో భారీ ర్యాలీ

మరోవైపు టీమిండియాపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఎడమ చేతి వాటం స్పిన్నర్‌గానూ షకీబ్ రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ స్పిన్నర్ యాష్లే గైల్స్ పేరిట ఉండేది. 2002లో ఇండియాపై గైల్స్ 10-0-57-5 ప్రద‌ర్శన చేశాడు. అతడి రికార్డును తాజాగా షకీబ్ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం షకీబుల్ హసన్ బంగ్లాదేశ్‌కు కీలక ఆటగాడిగా మారాడు. అగ్రశ్రేణి జట్లపై బ్యాటుతో పాటు బంతితోనూ రాణిస్తున్నాడు. టీ20లు, టెస్టులకు కెప్టెన్‌గానూ కొనసాగుతున్నాడు. 372 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ ఆల్‌రౌండర్ ర్యాంకుల్లోనూ షకీబ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 59 టెస్టులు ఆడిన ష‌కీబుల్ హ‌స‌న్‌ బౌలింగ్‌లో 215 వికెట్లు తీశాడు. వ‌న్డేల్లో 215 వికెట్లు సాధించాడు.

Exit mobile version