IND Vs ZIM: ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియాలో మరో మార్పు చోటు చేసుకుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన చేసింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలియజేసింది. ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతుండగా వాషింగ్టన్ సుందర్ భుజానికి గాయమైంది. ఆగస్టు 10న ఓల్డ్ ట్రాఫోర్డులో లాంక్‌షైర్‌కు ఆడుతూ ఓ మ్యాచ్‌లో డైవ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అతడు జింబాబ్వే టూర్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం సుందర్ రిహాబిలిటేషన్ కోసం బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళ్లనున్నాడు. అతడి గాయంపై ఓ అంచనాకు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించారు.
Read Also: Supreme Court: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య సస్పెన్షన్‌పై విచారణకు సుప్రీం అంగీకారం
‘ఇటీవల వాషింగ్టన్ సుందర్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. కానీ అతనిలో చాలా నైపుణ్యం ఉంది. దురదృష్టం కొద్దీ సిరీస్‌లు మిస్ అవుతున్నాడు. ఈ విషయంలో కొద్దిగా అదృష్టం కూడా కావాలి. మరో వారంలో భారత్‌కు ఆడుతున్నాడని అనుకుంటున్న తరుణంలో మళ్లీ ఈ గాయమైంది’ అంటూ బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు. కాగా గత ఏడాది జులైలో ఇంగ్లండ్ పర్యటనలో ఓ ప్రాక్టీస్ గేమ్‌లో సిరాజ్ బౌలింగ్‌లో చేతి వేలి గాయానికి గురైన సుందర్.. వరుసగా గాయపడుతునే ఉన్నాడు. డొమెస్టిక్ సీజన్‌తో పాటు ఈ ఏడాది జనవరిలో సౌతాఫ్రికాతో సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. తర్వాత కరోనా బారినపడి కోలుకున్నాడు. ఆ తర్వాత కాలిపిక్క కండరాల గాయంతో వెస్టిండీస్, శ్రీలంకతో సిరీస్‌లకు అందుబాటులో లేడు. అటు ఐపీఎల్‌లో ఐదు మ్యాచ్‌ల్లో ఆడలేదు. రిహాబిలిటేషన్ తర్వాత బీసీసీఐ పర్మిషన్‌తో కౌంటీల్లో ఆడాడు. చివరకు జట్టులోకి వచ్చే సమయంలో మరోసారి భుజం గాయంతో దూరమయ్యాడు.
