Site icon NTV Telugu

Sanju Samson Comeback: అవకాశాల్లేవు, ఛీకొట్టారు, రిటైర్మెంట్ అన్నారు.. కట్ చేస్తే ‘జెనరేషన్ నాక్’తో నోళ్లు మూయించాడు!

Sanju Samson Comeback

Sanju Samson Comeback

Sanju Samson Inspiring Comeback Story: టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం అనే చెప్పాలి. మెగా టోర్నీ ప్రారంభంలో సంజుకు అవకాశాలు రాలేదు. 48 బంతుల్లో అర్ధశతకం కూడా నమోదు చేయకపోయినా.. తన సామర్థ్యాన్ని నిరూపించుకునే ఛాన్స్ కోసం ఓపికగా ఎదురుచూశాడు. లీగ్ దశలో మూడు మ్యాచ్‌ల పాటు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అదే సమయంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా డకౌట్స్ అయినా.. సంజుకు అవకాశం రాకపోవడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది.

జట్టు మేనేజ్‌మెంట్‌, ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ టీమ్ ఎంపికలపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా సంజు శాంసన్‌పై ఒత్తిడిని పెంచాయి. అయినప్పటికీ అతడు సహనం కోల్పోలేదు. అవకాశం కోసం ఓపికగా ఎదురుచూశాడు. చివరకు ఫినిషర్ రింకు సింగ్ స్థానంలో అవకాశం దక్కింది. సంజు రాకతో ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను మూడో స్థానంలో ఆడించింది. మూడో స్ధానంలో ఆడే తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్‌కు మారాడు. అభిషేక్ శర్మ వరుసగా డకౌట్స్ అవుతుండడంతో అతడిపై ప్రెజర్ తగ్గించేందుకు ధాటిగా ఆడే సంజుని ఓపెనర్‌గా ఆడించారు. ఈ మార్పు సంజు కెరీర్‌కు కీలక మలుపుగా మారింది.

Also Read: Sanju Samson: 3 పరుగులతో సెంచరీ మిస్, మీరు నిరాశ పడ్డారా?.. సంజు షాకింగ్ ఆన్సర్!

2026 వరల్డ్‌ కప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన సంజు శాంసన్‌ ఒక్కసారి కూడా డక్ కాకుండా నిలకడగా రన్స్ చేశాడు. ఓపెనర్‌గా జట్టుకు బలమైన ఆరంభాలు అందించాడు. ముఖ్యంగా సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో చెలరేగి టీమిండియాకు విజయాన్ని అందించాడు. 50 బంతుల్లో 97 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సంజు ఇన్నింగ్స్‌ను చాలామంది ‘జెనరేషన్ నాక్’గా అభివర్ణిస్తున్నారు. సంజు ప్రదర్శనతో భారత్ సెమీఫైనల్‌ చేరింది. సెమీఫైనల్‌లో కూడా సంజు ఆడడం ఖాయం అయింది. ఒకవేళ భారత్ ఫైనల్ చేరినా.. సంజు ఓపెనర్‌గా ఆడుతాడు. కృషి, విశ్వాసం ఉంటే పరిస్థితులు మారుతాయని సంజు ప్రయాణంతో అర్ధమవుతోంది. ఈ వరల్డ్‌ కప్‌లో ఆలస్యంగా అవకాశం వచ్చినా.. రెండు చేతులా అందిపుచ్చుకుని సక్సెస్ అయ్యాడు.

Exit mobile version