Hanuma Vihari : ఆడకున్నా అవకాశాలు ఇస్తారా, ఇంకెంతకాలం జట్టులో ఉంటాడు.. హనుమ విహారి కీలక వ్యాఖ్యలు!

Sanju Samson Hanuma Vihari

Sanju Samson Hanuma Vihari

Hanuma Vihari on Sanju Samson Repeated Failures: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత సెంచరీతో చెలరేగగా.. అరంగేట్ర ఆటగాడు నమన్ ధీర్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మరోసారి విఫలమవడం చర్చనీయాంశంగా మారింది. 11 పరుగులకే పెవిలియన్‌కు చేరిన సంజుపై మాజీ భారత ఆటగాడు, హైదరాబాద్ ప్లేయర్ హనుమ విహారి కీలక వ్యాఖ్యలు చేశాడు.

సంజు శాంసన్‌కు చాలా అవకాశాలు లభిస్తున్నప్పటికీ.. నిలకడైన ప్రదర్శనలు ఇవ్వలేకపోతున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఏషియన్ గేమ్స్ 2026లో 9, 7, 2 రన్స్ మాత్రమే చేశాడు. అంతకుముందు అఫ్గానిస్థాన్‌పై రెండు అర్ధ సెంచరీలు చేసినా.. 2026 టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20ల్లో సంజు ఫామ్ ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో సంజుకు లభిస్తున్న వరుస అవకాశాలపై హనుమ విహారి స్పందించాడు. శాంసన్‌కు ఇంకా ఎంతకాలం అవకాశం ఇస్తారనే ప్రశ్నను లేవనెత్తిన విహారి.. తాను శాంసన్‌కు పెద్ద అభిమానినని, అతడు బాగా ఆడాలని కోరుకుంటానని చెప్పాడు. అయితే పోటీ పెరగడంతో సంజు మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు.

‘సంజు శాంసన్ మరోసారి విఫలమవడం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అతడికి ఇంకా ఎంతకాలం అవకాశం ఇస్తారు?. నేను శాంసన్‌కు పెద్ద అభిమానిని. అతడు బాగా ఆడాలని కోరుకుంటాను. కానీ అతడు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నాడని నాకు అనిపిస్తోంది. తన వెనుక పోటీ పెరిగినప్పుడు తాను సరిగ్గా ఆడలేకపోతానని అతడే గతంలో చెప్పాడు. ప్రపంచ కప్‌ 2026కు ముందు న్యూజిలాండ్ సిరీస్‌లో ఇషాన్ కిషన్ తిరిగి వచ్చినప్పుడు సంజు సరిగ్గా ఆడలేకపోయాడు. ఇప్పుడు అతడి వెనుక వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. కాబట్టి సంజు ఆ ఒత్తిడిని అనుభవిస్తూ ఉండొచ్చు. అందుకే సరైన ప్రదర్శన ఇవ్వలేకపొతున్నాడు. క్రికెట్‌లో ఒత్తిడి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా భారత్ తరఫున ఆడుతున్నప్పుడు జట్టులో చోటు కోసం తీవ్ర పోటీ ఉండటంతో ఆటగాళ్లు మానసిక ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుంది. శాంసన్ ఆ ఒత్తిడిని అనుభవిస్తూ ఉండొచ్చు. అతడి స్థానంలో ఎవరున్నా అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిందే’ అని హనుమ విహారి పేర్కొన్నాడు.

మొదటి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. హోప్ 52 పరుగులు చేయగా.. రూథర్‌ఫోర్డ్ 56 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ 10 బంతుల్లో 21 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం శాంసన్ 11 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. పవర్‌ప్లేలో భారత్ 62/2తో నిలిచింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 67 బంతుల్లో 137 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ 14.4 ఓవర్లలోనే 172/2తో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.