Sanju Samson: విజయాల కంటే పరాజయాలే ఎక్కువ, మానసికంగా కుంగిపోయా.. సంజు భావోద్వేగ వ్యాఖ్యలు!

  • వరల్డ్ కప్ నా చిన్ననాటి కల
  • ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డా
  • విజయాల కంటే పరాజయాలే ఎక్కువ
  • సంజు శాంసన్ భావోద్వేగ వ్యాఖ్యలు
Sanju Samson

Sanju Samson

Sanju Samson Opens Up on Failures: టీమిండియా స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ తన కెరీర్, లక్ష్యాల గురించి భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు వరల్డ్ కప్ గెలిపించడం తన చిన్ననాటి కల అని, దాన్ని నిజం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కృషి చేశానని తెలిపాడు. వరల్డ్ కప్ లక్ష్యాన్ని సాధించాలనే కోరిక తన మనసులో ఎప్పుడూ ఉండేదని, దాన్ని ప్రతిరోజూ ఊహించుకుంటూ ధ్యానం చేసేవాడినని వెల్లడించాడు. తన క్రికెట్ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, వైఫల్యాలు ఎదురయ్యాయని పేర్కొన్నాడు. కెరీర్‌లో విజయాల కంటే పరాజయాలే ఎక్కువ అని, ఓ సమయంలో మానసికంగా కుంగిపోయా అని సంజు చెప్పుకొచ్చాడు.

తాజాగా సంజు శాంసన్ మాట్లాడుతూ… ‘2019లో ఐదు సంవత్సరాల గ్యాప్ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చా. ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ నాతో మాట్లాడాడు. జట్టులోకి వచ్చాక నీ లక్ష్యం ఏంటి? అని అడిగాడు. నేను ఎలాంటి సందేహం లేకుండా భారత్‌కు వరల్డ్ కప్ అందించడమే నా టార్గెట్ అని చెప్పా. అప్పటి నుంచి 2026 వరకూ అదే లక్ష్యంతో కృషి చేశా. నా ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, వైఫల్యాలు ఎదురయ్యాయి. చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు కిందికి పడిపోయా. విజయాల కంటే పరాజయాలే ఎక్కువగా చూశా. అందుకే వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. అదే నా బలం’అని వివరించాడు.

Also Read: Kukatpally Money Robbery: కూకట్‌పల్లి దోపిడీలో భారీ ట్విస్ట్.. దుండగులు దోచింది కోటి కాదు, 21 కోట్లు!

‘వరల్డ్ కప్ 2026 ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విఫలమయ్యా. ఆ సమయంలో నేను మానసికంగా కుంగిపోయా. కానీ నాలుగు ఐదు రోజుల్లోనే తిరిగి లేచి నిలబడగలిగా. నాలో ఉన్న పట్టుదలే మళ్లీ విజయాల దిశగా నడిపించింది. చివరకు భారత జట్టుకు వరల్డ్ కప్ గెలిపించాలనే కల నెరవేరింది. నా జీవితంలో చివరి శ్వాస వరకు ఇది గుర్తుంటుంది’ అని సంజు శాంసన్ భావోద్వేగంగా వెల్లడించాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఆడిన 5 మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలు చేసి.. ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’గా సంజు నిలిచాడు.