Site icon NTV Telugu

Sahibzada Farhan: పాక్ గెలవాలనే బాబర్ ఆజమ్‌ను తప్పించాం.. ఓపెనర్ సాహిబ్‌జాదా సంచలన కామెంట్స్!

Sahibzada Farhan, Babar Azam

Sahibzada Farhan, Babar Azam

టీ20 ప్రపంచ కప్‌ 2026 సూపర్‌-8 భాగంగా పాకిస్థాన్‌–శ్రీలంక మ్యాచ్ అనంతరం ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. మ్యాచ్‌లో సెంచరీ సాధించినప్పటికీ.. జట్టు ఓటమి పాలవడంతో తాను సంతృప్తిగా లేనని చెప్పాడు. జట్టుగా గెలవడానికి తమవంతు ప్రయత్నం చేశామని, కానీ ప్రత్యర్థి జట్టు అద్భుతంగా ఆడిందని పేర్కొన్నాడు. జట్టు విజయం సాధించకపోయినా దేశం కోసం మంచి ప్రదర్శన చేయడం తన కెరీర్‌లో ప్రత్యేక క్షణమని భావిస్తున్నానని ఫర్హాన్‌ చెప్పాడు. లంకపై ఫర్హాన్‌ 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 100 రన్స్ చేశాడు.

మెరుపు సెంచరీ చేసిన సాహిబ్‌జాదా ఫర్హాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ఫర్హాన్‌ చేసిన వ్యాఖ్యల్లో అత్యంత వివాదాస్పద అంశం మ్యాచ్ ఫిక్సింగ్ గురించి ప్రస్తావన చేయడం. ‘గెలవడానికి అవసరమైన ప్రతిదీ చేశాం. మా స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను కూడా తప్పించి అబ్రార్‌ను ఆడించాం. అయినా గెలవలేకపోయాం. చాలా బాధగా ఉంది’ అని చెప్పాడు. కోచ్ మైక్ హెసెన్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా బాబర్‌ను తప్పించినట్టు పరోక్షంగా చెప్పుకొచ్చాడు. ఈ విజయంతో పాక్ జట్టుకు ఉపయోగం లేదు. టీ20 ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్‌ నిష్క్రమించక తప్పలేదు. సెమీస్‌ చేరాలంటే 147 స్కోరు లోపు శ్రీలంకను కట్టడి చేయడంలో పాక్ విఫలమైంది.

Also Read: Khamenei: ఖమేనీ మూలాలు భారత్ లోనే!.. యూపీ నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు

‘మ్యాచ్‌కు ముందు నుంచే జట్టుగా బాగా ఆడతామని నమ్మకం ఉంది. ఫకర్ జమాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడు సెంచరీ సాధించి ఉంటే జట్టుకు ఇంకా ఉపయోగంగా ఉండేది. నా సెంచరీ వ్యక్తిగతంగా అది గొప్ప విజయమే అయినా జట్టు గెలవకపోవడం బాధ కలిగించింది. గత రెండు మూడు సెషన్లలో బ్యాటింగ్ కోచ్‌తో మాట్లాడా. బాగా బ్యాటింగ్‌ చేస్తున్నావ్ అని చెప్పి నాలో అదనపు కాన్ఫిడెన్స్ నింపాడు. బంతి నా రేంజ్‌లోకి వస్తే సులభంగా బౌండరీకి పంపగలనన్న నమ్మకం కలిగింది. స్థిరమైన ప్రదర్శన వెనుక దేశీయ క్రికెట్ కీలక పాత్ర పోషించింది. గత నాలుగేళ్లుగా నిరంతరం డొమెస్టిక్ మ్యాచ్‌లు ఆడుతూ రన్ చార్ట్స్‌లో టాప్‌లో నిలిచా. పీఎస్ఎల్, ఆసియా కప్ వంటి టోర్నీల్లోనూ మంచి ప్రదర్శన చేశా. అదే ఫామ్ ఇప్పుడు కూడా కొనసాగుతోంది’ అని ఫర్హాన్‌ చెప్పుకొచ్చాడు.

Exit mobile version