Gautam Gambhir’s Support Staff Under Scanner: ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు అతని సహాయక సిబ్బందిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత నెలలో ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-2తో కోల్పోయిన భారత్.. తాజాగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-4తో చిత్తుగా ఓడిపోయింది. ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలో జట్టు మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వస్తున్నాయి. మంగళవారం (జులై 14) నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా కోచింగ్ స్టాఫ్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
టెన్ డస్కాటే దాదాపుగా అవుట్:
గౌతమ్ గంభీర్‌కు అత్యంత సన్నిహితులైన అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తమ భవిష్యత్తుపై పునరాలోచన చేస్తున్నట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత వీరి కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏడాది పొడవునా భారత జట్టుతో కలిసి నిరంతరం పర్యటించడం తనకు ఇబ్బందిగా మారిందని టెన్ డస్కాటే బీసీసీఐకి తెలిపినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే అతడు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఐపీఎల్ ఫ్రాంచైజీతో టెన్ డస్కాటే ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
భారత జట్టులోకి లక్ష్మీపతి బాలాజీ:
బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాత్రం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. బీసీసీఐ మాత్రం ఈ ఇద్దరినీ కొనసాగించే మార్గాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ టెన్ డస్కాటే, మోర్కెల్ టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో కొనసాగకపోతే.. ఇటీవల బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమితుడైన లక్ష్మీపతి బాలాజీని భారత జట్టుతో శ్రీలంక పర్యటనకు పంపే అవకాశాలు ఉన్నాయని సదరు నివేదిక పేర్కొంది. బాలాజీకి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. టీమిండియా, చెన్నైకి ఆడుతూ ఎన్నో విజయాలు అందించాడు.
దిలీప్ భవిష్యత్తుపై అనిశ్చితి:
ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ భవిష్యత్తుపైనా అనిశ్చితి నెలకొంది. ఇటీవలి కాలంలో భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు గణనీయంగా పడిపోవడంపై బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గత ఏడాది అభిషేక్ నాయర్‌తో పాటు టీ దిలీప్‌ను కూడా తప్పించాలని భావించినప్పటికీ.. చివరి క్షణంలో దిలీప్‌కు మరో అవకాశం వచ్చింది. అయితే ప్రస్తుతం ఫీల్డింగ్‌లో ఆశించిన మెరుగుదల కనిపించకపోవడంతో.. ఈసారి ఆయనపై కూడా వేటు పడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో మార్పులపై స్పష్టత వచ్చే అవకాశముంది.

