Site icon NTV Telugu

Rumeli Dhar: రిటైర్మెంట్ ప్రకటించిన మరో టీమిండియా మహిళా క్రికెటర్

Rumeli Dhar

Rumeli Dhar

టీమిండియాకు చెందిన మరో మహిళా క్రికెటర్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవల సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా వెటరన్ ఆల్‌రౌండర్ రుమేలీ ధర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. 38 ఏళ్ల రుమేలీ 2003లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసింది. ఇప్పటివరకు ఆమె ఇండియా తరఫున 78 వన్డేలు ఆడి 961 పరుగులు చేసింది. అటు 18 టీ20లు ఆడి 131 పరుగులు సాధించింది. టెస్ట్ కెరీర్‌లో నాలుగు టెస్టులు మాత్రమే ఆడింది. నాలుగు టెస్టుల్లో రుమేలీ ధర్ 236 పరుగులు చేసింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 84 వికెట్లు పడగొట్టింది. 2005 వరల్డ్ కప్‌లో భారత్‌ ఫైనల్ చేరడంలో రుమేలీ ధర్ కీలకపాత్ర పోషించింది.

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని రుమేలీ ధర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది. ’23 ఏళ్ల క్రితం బెంగాల్‌లోని శ్యామ్‌నగర్‌లో ప్రారంభమైన నా క్రికెట్‌ కెరీర్‌ నేటితో ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని రకాల ఫార్మాట్‌ నుంచి వైదొలుగుతున్నా. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. ఇక 2005 నా కెరీర్‌లో మరిచిపోలేని సంవత్సరం. ఆ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌ చేరడం.. అందులో నేను భాగస్వామ్యం అవడం ఎప్పటికి మరిచిపోలేను. మెన్‌ ఇన్‌ బ్లూ డ్రెస్‌లో కప్‌ కొట్టలేదన్న వెలితి తప్ప మిగతా అంతా సంతోషంగానే అనిపించింది. ఆ తర్వాత గాయాలు తరచూ వేధించినప్పటికి తిరిగి ఫుంజుకుని టీమిండియాకు ఆడాను. ఇక యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. అందుకే రిటైర్మెంట్‌కు ఇదే కరెక్ట్‌ అని భావించాను. ఇంతకాలం నాకు సహకరించిన కుటుంబ సభ్యులకు, బీసీసీఐ, నా స్నేహితులకు కృతజ్ఞతలు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో నేను ప్రాతినిధ్యం వహించిన అన్ని జట్లకు నా తరపున మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా’ అంటూ రుమేలీ ధర్ పోస్ట్ చేసింది.

Team India: టీమిండియాకు షాక్.. విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్

Exit mobile version