Rohit Sharma: ఇంగ్లండ్‌తో మూడో వన్డే మ్యాచ్‌.. అదే రోహిత్‌కు ప్రధాన సమస్య!

  • మూడో వన్డే మ్యాచ్‌కు ఆసన్నమైన సమయం
  • మరోసారి చర్చనీయాంశంగా రోహిత్ శర్మ ఫామ్
  • అదే రోహిత్‌కు ప్రధాన సమస్య అంటున్న అభిషేక్
Rohit Sharma

Rohit Sharma

Abhishek Nayar on Rohit Sharma Form: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫామ్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన హిట్‌మ్యాన్.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో మాత్రం తేలిపోతున్నాడు. తొలి రెండు వన్డేల్లో వరుసగా 11, 26 పరుగులే చేయడంతో.. అతడి బ్యాటింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్ ఫామ్‌పై మాజీ భారత బ్యాటర్, మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు.

స్టార్ స్పోర్ట్స్‌తో అభిషేక్ నాయర్ మాట్లాడుతూ.. ‘ఇంగ్లండ్ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. స్వింగ్, సీమ్‌కు గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని ఫార్మాట్లు ఆడని రోహిత్ శర్మ అలాంటి పరిస్థితుల్లో కాస్త సమయం తీసుకుని బ్యాటింగ్ చేయడం సహజమే. రెండో వన్డేలో హిట్‌మ్యాన్ బ్యాటింగ్ టెంపో బాగానే కనిపించింది. స్ట్రైక్‌రేట్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అసవరం లేదు. కానీ సాధారణంగా రోహిత్ 25-30 పరుగుల వరకు వచ్చాడంటే దాన్ని అర్ధశతకంగా, భారీ స్కోర్‌గా మార్చేస్తాడు. ఈసారి 26 పరుగుల వద్దే ఔటవ్వడం మాత్రం అతడిని కచ్చితంగా ఆలోచింపజేస్తుంది. అదే రోహిత్‌కు ప్రధాన ఆందోళ’ అని చెప్పాడు.

రెండో వన్డేలో ఆఫ్‌ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఔటైన తీరు పైనా నాయర్ స్పందించాడు. ‘సాధారణంగా రోహిత్ ఆఫ్‌ స్పిన్నర్లకు ఎక్కువగా వికెట్ ఇవ్వడు. కానీ ఈసారి పరుగుల కోసం ఒత్తిడిలో ఉండటం వల్లే ఆ షాట్ ఆడాడు. ఇది టెక్నిక్ సమస్య కంటే మానసిక ఒత్తిడికి సంబంధించిన విషయం. అయినప్పటికీ హిట్‌మ్యాన్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడనే నమ్మకం నాకు ఉంది. అతడి ఫామ్ గురించి నేను పెద్దగా ఆందోళన చెందడం లేదు’ అని తెలిపాడు. ఇప్పటికే సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడి విమర్శలకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పడంతో పాటు భారత్‌కు సిరీస్ విజయాన్ని అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు.