Site icon NTV Telugu

Rohit Sharma Indore Incident: రోహిత్‌ శర్మ చేతిని లాగిన మహిళ.. షాక్ తిన్న హిట్‌మ్యాన్!

Rohit Sharma Woman

Rohit Sharma Woman

భారత్, న్యూజిలాండ్‌ వన్డే సందర్భంగా ఇండోర్‌లో చోటుచేసుకున్న ఓ అనూహ్య ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. భారత క్రికెట్ జట్టు బస చేసిన హోటల్‌లోకి భద్రతను ఉల్లంఘిస్తూ ఓ మహిళ ప్రవేశించి.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేతిని పట్టుకుని సహాయం కోరడం కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. హిట్‌మ్యాన్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైనట్లు అందులో కనిపించాడు. వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళను సరితా శర్మగా గుర్తించారు. అయితే తాను అలా చేయడానికి గల కారణాన్ని వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.

తన కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని, అమెరికా నుంచి తెప్పించాల్సిన ఇంజెక్షన్ ఖర్చు రూ.9 కోట్లు అవుతుందని సరితా వెల్లడించారు. ‘నా పేరు సరితా శర్మ. నా కుమార్తె అనిక తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. అనికను కాపాడాలంటే యూఎస్ నుంచి తెప్పించాల్సిన రూ.9 కోట్ల విలువైన ఇంజక్షన్‌ అవసరం. ఇంజెక్షన్ ఖర్చు చాలా ఎక్కువగా ఉండటంతో శిబిరాలు ఏర్పాటు చేసుకుని నిధులు సేకరించాం. ఇప్పటివరకు రూ.4.1 కోట్లు సమకూర్చగలిగాం. పాపను బ్రతికించుకోవడానికి ఎక్కువ సమయం లేదు. అందుకే ఇండోర్ మ్యాచ్‌ సందర్భంగా క్రికెటర్లను సాయం కోసం కోరాలనుకున్నాం. డొనేషన్‌ క్యాంప్‌ నిర్వహించాం కానీ.. తగినన్ని నిధులు సమీకరించలేకపోయాం’ అని సరితా చెప్పారు.

‘నా కూతురి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలోనే నేను విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలను కలవాలనుకున్నా. రోహిత్‌ సర్ బస చేస్తున్న హోటల్‌ వద్దకు వెళ్లా. భావోద్వేగంలో నేను చేతిని లాగాను. సెల్ఫీ కోసం అలా చేయలేదు. రోహిత్‌ సర్‌ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం అసలే లేదు. పిల్లలకు సాయం చేసే మనసున్న రోహిత్, కోహ్లీ దృష్టికి నా సమస్యను తీసుకెళ్లాలనే తపనతోనే అలా చేశా. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో అలా ప్రవర్తించా. నేను క్షమాపణలు చెబుతున్నాను. విరాట్‌, రోహిత్‌ సర్‌లు నాకు సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా కూతురి ప్రాణాలను కాపాడండి’ అంటూ సరితా శర్మ బోరున విలపించారు. మరి విషయం తెలిసిన రో-కోలు సాయం చేస్తారో లేదో చూడాలి.

Also Read: Bollywood : బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌ని ఏలి హాలీవుడ్‌ కలల్ని నిజం చేసుకున్న స్టార్ హీరోయిన్

మరోవైపు ఈ ఘటనతో ఆటగాళ్ల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. జట్టు హోటళ్ల వద్ద భద్రతా ఏర్పాట్లు ఎంత పటిష్టంగా ఉండాలి అనే అంశంపై అభిమానులు, నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ వద్దకు ఓ మహిళ సులభంగా చేరుకోవడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పటివరకు ఈ విషయంపై అధికారులు గానీ, భారత జట్టు యాజమాన్యం గానీ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఒకవైపు మహిళ పరిస్థితిపై సానుభూతి వ్యక్తమవుతుండగా.. మరోవైపు ఆటగాళ్లకు కఠిన భద్రత అవసరమని డిమాండ్ వినిపిస్తోంది.

Exit mobile version