NTV Telugu Site icon

Rohit Sharma: ప్చ్.. ఆ మ్యాచ్ గెలవాల్సింది

Rohit Sharma On India Defea

Rohit Sharma On India Defea

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం, అలాగే సిరీస్ (2-2) సమం కావడంపై కెప్టెన్ రోహిత్ శర్మ విచారం వ్యక్తం చేశాడు. ఆ రీషెడ్యూల్ మ్యాచ్ గెలిచి ఉంటే, సిరీస్ భారత్ సొంతమై ఉండేదన్నాడు. ‘‘ప్చ్.. చివరి టెస్ట్ మ్యాచ్ గెలవాల్సింది. అది గెలకపోవడం నిరాశకు గురి చేసింది. నిజానికి.. ఆ టెస్ట్ సిరీస్ భారత్ గెలవాల్సింది కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. అయితే.. ఈ ఓటమి ప్రభావం ఇంగ్లండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లపై ప్రభావం అంతగా ఉండకపోవచ్చని భావిస్తున్నా. ఎందుకంటే.. అన్నీ వేర్వేరు ఫార్మాట్లు కదా’’ అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఇక ఇదే సమయంలో అక్టోబర్ నుంచి జరగనున్న టీ20 ప్రపంపకప్-2022 టోర్నీపై రోహిత్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ను దృష్టిలో పెట్టుకుని మేము ముందుకు సాగుతున్నాం. ఇకపై ఆడే ప్రతీ సిరీస్ మాకు చాలా కీలకమైంది. ప్రతి మ్యాచ్ ముఖ్యమే. ముఖ్యంగా.. ఇంగ్లండ్‌తో పోరు చాలా ఛాలెంజ్ వంటిది’’ అని అన్నాడు. ఇప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్లు ఐర్లాండ్ టీ20 సిరీస్‌తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడారు కాబట్టి.. బాగానే రాణిస్తారన్న ధీమా వ్యక్తం చేశాడు. కాగా.. గతేడాదిలోనే జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్‌ను కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే! ఈ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చేతులెత్తేసింది. దీంతో.. 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించడంతో టెస్ట్ సిరీస్ 2-2తో సమం అయ్యింది.