T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చేశాడు. గురువారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి రోహిత్ సత్తా చాటుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మూడు సిక్సర్లు బాదాడు. దీంతో టీమిండియా తరఫున టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో రోహిత్ అగ్రస్థానానికి చేరాడు. గతంలో ఈ రికార్డు యువరాజ్ పేరిట ఉండేది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ 34 సిక్సర్లు కొట్టగా యువరాజ్ 33 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (24), ధోనీ(16), రైనా(12) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఓవరాల్‌గా చూసుకుంటే టీ20 ప్రపంచకప్ హిస్టరీలో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ టాప్‌లో ఉన్నాడు. అతడు 63 సిక్సర్లు కొట్టాడు.
Read Also: Hair Cut Failed: యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన హెయిర్ కటింగ్.. వీడియో వైరల్
అటు టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో శ్రీలంక ఆటగాడు దిల్షాన్‌ను రోహిత్ అధిగమించి నాలుగో స్థానానికి చేరాడు. ఇప్పటివరకు రోహిత్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో 35 మ్యాచ్‌లు ఆడి 904 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 79. శ్రీలంక ఆటగాడు దిల్షాన్ 35 మ్యాచ్‌లు ఆడి 896 పరుగులు చేశాడు. దిల్షాన్ ఖాతాలో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 96. ఈ జాబితాలో మహేల జయవర్ధనే (1,016), విరాట్ కోహ్లీ (989), క్రిస్ గేల్ (965) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ ఫామ్ ఇలానే కొనసాగిస్తే… వచ్చే మ్యాచ్‌లోనే జయవర్ధనే రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
