Rohit Sharma Creates World Record In T20I: టీ20ల్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 వ్యక్తిగత పరుగులు చేయడంతో, రోహిత్ ఈ రికార్డ్‌ని అందుకోగలిగాడు. తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకూ 127 మ్యాచ్‌లు ఆడిన రోహిత్, మొత్తం 3548 పరుగులు చేశాడు. ఇంతకుముందు న్యూజీలాండ్ బ్యాట్స్మన్ సుబీ బేట్స్ 3531 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. 17 పరుగుల తేడాతో రోహిత్ అతడ్ని వెనక్కు నెట్టేసి, అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లలో 27 హాఫ్ సెంచరీలతో పాటు 4 సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ తర్వాత టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో.. గప్టిల్(3497), కోహ్లీ(3462) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
ఇదిలావుండగా.. లీగ్ దశలో పాకిస్తాన్, హాంగ్ కాంగ్‌లతో జరిగిన మ్యాచ్‌లలో విజయకేతనం ఎగరేసిన భారత్.. సూపర్ ఫోర్‌లో మాత్రం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. బ్యాట్స్మన్లలో విరాట్ కోహ్లీ మినహాయిస్తే, మిగతా వాళ్లెవ్వరూ అంతగా రాణించలేకపోయారు. అప్పటికీ పాకిస్తాన్ ముందు భారత్ భారీ లక్ష్యాన్ని (182) ఉంచగలిగింది. కానీ, బౌలర్లే దారుణంగా విఫలమయ్యారు. పాక్‌తో ఆడిన గత మ్యాచ్‌లో చెలరేగిన బౌలర్లే, ఈసారి డీలా పడ్డారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మిస్ ఫీల్డ్స్ కూడా చేశారు. ఫలితంగా.. గెలవాల్సిన మ్యాచ్‌ని భారత్ చేజేతులా వదులుకుంది. ఇప్పుడు టీమిండియా ఫైనల్‌కి చేరాలంటే.. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌లతో ఆడబోయే మ్యాచ్‌లను భారీ పరుగులతో గెలవాల్సి ఉంటుంది. అయితే.. ఆ రెండు జట్లు కూడా ఫుల్ ఫామ్‌లో ఉన్నాయి కాబట్టి, వాటిని తక్కువ అంచనా వేయకూడదు. ఎలాంటి తప్పులు చేయకుండా, టీమిండియా రెచ్చిపోయి ఆడాల్సి ఉంటుంది.