Site icon NTV Telugu

వెస్టిండీస్ సిరీస్‌కు రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు

దక్షిణాఫ్రికా గడ్డపై వరుస పరాజయాలతో డీలా పడ్డ టీమిండియా.. త్వరలో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రానున్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్.. ప్రస్తుతం పూర్తి కోలుకుని ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. రోహిత్‌ బుధవారం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్‌ పరీక్షకు హాజరుకానున్నాడు. ఆ తర్వాతే సెలక్షన్‌ కమిటీ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ఎంపిక చేయనుంది.

దక్షిణాఫ్రికా పర్యటనలో విఫలమైన ఆటగాళ్లను సెలక్టర్లు పక్కనబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భువనేశ్వర్, అశ్విన్‌ల స్థానంలో యువ ఆటగాళ్లకు చోటు కల్పించనున్నారు. ఈ సిరీస్‌కు బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే సూచనలు ఉన్నాయి. అతడి స్థానంలో షమీ జట్టులోకి రానున్నాడు. అటు ఆల్‌రౌండర్ కోటాలో వెంకటేష్ అయ్యర్ బదులు హార్డిక్ పాండ్యా పునరాగమనం చేసే అవకాశాలున్నాయి.

జట్టు (అంచనా): రోహిత్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా/వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, దీపక్ చాహర్, చాహల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిధ్ కృష్ణ, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్

Exit mobile version