Rohit Sharma Breaks MS Dhoni Record: సెప్టెంబర్ 28వ తేదీన దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ సాధించిన విజయం.. రోహిత్ శర్మ ఖాతాలో ఒక అరుదైన రికార్డ్‌ని తెచ్చిపెట్టింది. గతంలో ఉన్న ధోనీ రికార్డ్ తుడిచికొట్టుకుపోయేలా చేసింది. ఆ విజయంలో.. ఒక ఏడాదిలో భారత జట్టుని అత్యధిక టీ20 మ్యాచ్‌ల్లో గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉండేది. అతని నాయకత్వంలో భారత్ 2016లో 15 టీ20 మ్యాచ్‌లు గెలిచింది. ఇన్నాళ్లపాటు బద్దలవ్వని ఆ రికార్డ్‌ని ఇప్పుడు రోహిత్ బ్రేక్ చేసి, చరిత్ర తిరగరాశాడు. కేరళలోని తిరువనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సౌతాఫ్రికాపై భారత్ విజయం సాధించడంతో.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఖాతాలో 16 విజయాలు చేరాయి. కాకపోతే.. ఈ మ్యాచ్‌లో రోహిత్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగడమే నిరాశాజనకమైన విషయం.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు ఆరంభంలోనే ఘోరంగా తడబడింది. భారత బౌలర్ల ధాటికి.. టాపార్డర్ కుప్పకూలింది. అయితే.. మర్క్‌రమ్, పార్నెల్, కేశవ్‌లు కాస్త నిలకడగా రాణించడంతో జట్టు కాస్త కుదురుకోగలిగింది. దీంతో 8 వికెట్ల నష్టానికి సౌతాఫ్రికా 106 పరుగులు చేసింది. 107 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన భారత్ కూడా మొదట్లో తడబడింది. రోహిత్ గోల్డెన్ డకౌట్ అవ్వగా.. కోహ్లీ కూడా ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. అయితే.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి కేఎల్ రాహుల్ రాణించడంతో.. భారత్ లక్ష్యాన్ని చేధించగలిగింది. ఆ ఇద్దరూ అర్థశతకాలు సాధించారు. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అర్ష్‌దీప్‌కి (4 ఓవర్లలో 32 పరుగులు, 3 వికెట్లు) దక్కింది.