NTV Telugu Site icon

Robin Uthappa: టీమిండియాది ఇదేం తీరు? ఆటగాళ్లకు ఏం సందేశం ఇస్తున్నారు?

Robin Uthappa

Robin Uthappa

Robin Uthappa: ఇటీవల కాలంలో టీమిండియా ఎంపిక విషయంలో సెలక్టర్లపై తరచూ విమర్శలు వస్తున్నాయి. జట్టును సరిగ్గా ఎంపిక చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలలో టీమిండియా చతికిలపడిందనే వాదన ఉంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ జట్టు ఎంపిక తీరును తప్పుబట్టాడు. గత ఏడాది డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన కుల్‌దీప్ యాదవ్‌ను రెండో టెస్టుకు పక్కన పెట్టడం ఆశ్చర్యపరిచిందన్నాడు. ఇలాంటి ఘటనలు ఇటీవల భారత జట్టులో చాలా జరుగుతున్నాయని.. ఇలాంటి చర్యలు ఆటగాళ్లకు మంచి సందేశాన్ని ఇవ్వబోవని ఉతప్ప హెచ్చరించాడు.

Read Also: Team India: హైదరాబాద్ చేరుకున్న టీమిండియా.. రేపు ప్రాక్టీస్ షురూ..!!

టీమిండియా సెలక్టర్ల వల్ల ఆటగాళ్లలో అభద్రతా భావం ఏర్పడుతుందని.. అప్పుడు వాళ్ల ఆటతీరుపై ప్రభావం పడుతుందని రాబిన్ ఉతప్ప ఆరోపించాడు. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను జట్టులోకి తీసుకోకుండా రిజర్వు బెంచ్‌పై కూర్చోబెట్టడం సరికాదన్నాడు. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఉతప్ప సభ్యుడిగా ఉన్నాడు. ప్రస్తుతం యూఏఈలోని ILT20లో దుబాయ్ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఉతప్ప.. ఐసీసీ టోర్నమెంట్‌లలో భారత్ దుర్భర ప్రదర్శన వెనుక ఇలాంటి ఎంపిక నిర్ణయాలే కారణమని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చాలా సంవత్సరాలు తమ జట్లలో తక్కువ మార్పులు మాత్రమే చేశాయని.. అందుకే ఆ రెండు జట్లుగా విజయవంతం అయ్యాయని ఉతప్ప అన్నాడు. జట్టులో తరచూ మార్పులు చేస్తే ఆటగాళ్లు సరిగ్గా ఆడలేరని అభిప్రాయపడ్డాడు. కాగా వన్డేలలో 2011 తర్వాత ఇప్పటివరకు భారత్ విశ్వవిజేతగా నిలవలేకపోయింది.