Rishabh Pant Breaks MS Dhoni’s Test Record: టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. విదేశీ గడ్డపై లేదా తటస్థ వేదికల్లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజులో పంత్ ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో తన గురువు, దిగ్గజ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీని అధిగమించాడు. మహీ 2496 పరుగులు చేయగా.. పంత్ 2500 పరుగుల మైలురాయిని దాటేశాడు.
ఈ జాబితాలో ఫరూక్ ఇంజినీర్ 1,209 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. సయ్యద్ కిర్మాణీ 1,109 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా.. కిరణ్ మోరే 901 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. విదేశీ, తటస్థ టెస్టుల్లో వికెట్ కీపర్‌గా పంత్ ప్రదర్శన మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది. 2,501 పరుగులను 41.68 సగటుతో సాధించాడు. మరోవైపు ధోనీ 2,496 పరుగులను 32.84 సగటుతో నమోదు చేశాడు. దీంతో కేవలం పరుగుల పరంగానే కాకుండా.. బ్యాటింగ్ సగటులోనూ పంత్ ఆధిక్యంలో ఉన్నాడు.
గాయం కావడంతో నిన్న రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రిషభ్ పంత్ (18) ఇవాళ మైదానంలోకి దిగాడు. నిన్నటి మాదిరిగానే షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పెట్టేందుకు ఇవాళ కూడా లంక పేసర్లు ప్రయత్నిస్తున్నారు. కానీ పంత్ కొట్టిన ఓ బంతి ఏకంగా 95 మీటర్ల సిక్స్‌గా వెళ్లింది. గాయంతో ఉన్నా అంత పెద్ద సిక్సర్ కొట్టడం విశేషం. అతడి బ్యాటింగ్ చూస్తుంటే.. సెంచరీ చేసేలా ఉన్నాడు. రెండో రోజు ఆటలో తొలి సెషన్ ముగిసే సమయానికి భారత్ స్కోరు 419/6గా ఉంది. క్రీజ్‌లో రిషభ్ పంత్ (63), ధ్రువ్ జురెల్ (59) ఉన్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు ఇప్పటికే 112 పరుగులు జోడించారు. ఈ సెషన్‌లో టీమిండియా 119 పరుగులు చేసింది.

