World Cup 2023: దాదాపుగా 20 ఏళ్ల తరువాత భారత్, ఆస్ట్రేలియా జట్లు వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌లో తలపడబోతున్నాయి. చివరి సారిగా 2003లో భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్స్‌లో ఆడాయి. సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్ నేతృత్వంలో ఈ రెండు జట్లు మ్యాచ్ ఆడాయి. అయితే ఈ మ్యాచ్ మాత్రం కోట్లాది మంది భారత అభిమానులకు చేదు జ్ఞాపకం మిగిల్చింది. ఆసీస్ కెప్టెన్ రికీపాంటింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి భారత విజయాన్ని అడ్డుకున్నాడు. పాంటింగ్ కేవలం 121 బాల్స్‌లోనే 140 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొదటి 50 రన్స్‌కి 70 బాల్స్ తీసుకున్న పాంటింగ్, ఆ తర్వాత గేర్ మార్చి 47 బాల్స్ లోనే చివరి 90 రన్స్ సాధించాడు. అతనితో పాటు ఓపెనర్లుగా వచ్చిన మాథ్యూహెడెన్, గిల్‌క్రిస్ట్‌లు కూడా మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. జవగల్ శ్రీనాథ్, ఆశిష్ నెహ్రా, హర్బజన్, జహీర్ ఖాన్ అందరి బౌలర్లకు రికీపాంటింగ్ చుక్కలు చూపాడు.
Read Also: Pat Cummins: మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్.. పిచ్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..!
తాజాగా ఆదివారం మరోసారి ఆస్ట్రేలియా, ఇండియా టీమ్స్ ఫైనల్స్‌లో తలపడుతున్న తరుణంలో రికీ పాంటింగ్ 2003 మ్యాచ్‌ని గుర్తు చేసుకున్నాడు. ‘‘ మొదట్లో నెమ్మదిగా ఆడిన తాను ఆట తమ నియంత్రణలో ఉన్నందున త్వరగా స్కోర్ చేయాలని అనుకున్నానని, కెప్టెన్‌గా నిలదొక్కుకున్నాక, డామియన్ మార్టిన్‌తో మంచి భాగస్వామ్యాన్ని నిర్మించామని, దీంతో ఫైనల్ మ్యాచ్‌లో 359 పరుగులు చేయడం సాధ్యం అయింది’’ అని రికీపాంటింగ్ అన్నారు.
ఈ మ్యాచ్‌లో ఆసీస్ నిర్ణయించిన 360 పరుగులు చేధించే క్రమంలో ఓపెనర్‌గా వచ్చిన సచిన్ టెండూల్కర్ కేవలం 4 రన్స్‌కే వెనుదిరిగాడు. దీంతో భారత్ ఓటమి సగం ఖరారైంది. కేవలం వీరేంద్ర సెహ్వాగ్ మాత్రంమే 82 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరకు 39 ఓవర్లలో భారత్ 234 పరుగులకే ఆలౌట్ అయింది. 125 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆస్ట్రేలియా కోచ్ జాన్ బుకానన్ జట్టును సమిష్టిగా ముందుకు నడిపించాడని రికీపాటింగ్ అన్నాడు.